NTV Telugu Site icon

Veturi Sundararama Murthy: పాటసారి… పాటలూరి… వేటూరి!

Veturi Sundararama Murthy

Veturi Sundararama Murthy

Veturi Sundararama Murthy: “అలలు కదిలినా పాటే… ఆకు మెదిలినా పాటే… కలలు చెదిరినా పాటే… కలత చెందినా పాటే…” అంటూ జీవితంలో పాట ప్రాముఖ్యం తెలిపిన చతురులు వేటూరి సుందర రామమూర్తి. “ఏలుకుంటే పాట… మేలుకుంటే పాట… పాడుకుంటే పాట – మా దేవుడు…” అంటూ తెలుగువారి భక్తిభావంలోనే పాట పలుకుతుందని చాటిన కవిశిఖామణి వేటూరి. మహాపండితుడు, అన్నమయ్య పదకవితలను లోకానికి తెలియజేయడానికి పూనుకున్న ఘనుడు వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆయన సోదరుని తనయుడే వేటూరి సుందర రామమూర్తి. వేటూరి వారింట తలుపును తట్టినా కవిత్వం పలుకుతుందని ప్రతీతి. పెదనాన్న వేటూరి ప్రభాకర శాస్త్రి నేతృత్వంలో పదాలను విరవడం, కలపడం వంటి విన్యాసాలు నేర్చారు సుందరరాముడు. చదువు పూర్తయ్యాక పత్రికారచయితగా జీవనం ఆరంభించారు. వార్తలు రాసే సమయంలోనూ వేటూరి రాసిన పలుకులు పాటలను తలపించేవి. ఇక సినిమా రంగంలో తొలి పాట మొద‌లు చివ‌రి పాట దాకా వేటూరి గీత‌వైభ‌వం మ‌ర‌పురానిది మ‌రువ‌లేనిది. వేటూరి సుందర రామమూర్తిలోని పదవిన్యాసాలు మహానటుడు యన్టీఆర్ ను ఆకర్షించాయి. ఆయన అదే పనిగా వేటూరిని పిలిపించి, చిత్రసీమకు ఆహ్వానించారు. చిత్రవిచిత్రాల చిత్రసీమలో తాను రాణించలేనని వేటూరి దూరం జరిగారు. అయినా పట్టు పట్టి వేటూరితో తన ‘దీక్ష’ చిత్రం కోసం ఓ పాట రాయించారు నందమూరి. అయితే అప్పటికే ఆ సినిమా పాటల పర్వం ముగియడంతో నందమూరికి వేటూరి రాసిన పాట వెలుగు చూడలేదు. ఆ తరువాత వేటూరి ప్రతిభ తెలుసుకున్న కె.విశ్వనాథ్ తన ‘ఓ సీత కథ’లో “భారతనారీ చరితము…” అనే హరికథను రాయించుకున్నారు. ఆ పాటతోనే వేటూరి చిత్రసీమలో ప్రవేశించారు.

వేటూరి పదవిన్యాసాల గురించి బోలెడు కథలు చెబుతారు. “పాట రాయకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా” అంటూ ‘అడవిరాముడు’ నిర్మాతలు అడిగితే, “ఆ రేసుకు పోయి పారేసుకున్నాను…” అన్నారట. అంతే- అదే పల్లవిగా పాట రాయమని దర్శకుడు కోరడం, అలా “ఆరేసుకోబోయి పారేసుకున్నాను…” పాట వెలుగు చూసింది. ప్రేక్షకులను థియేటర్లలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేసింది. ఇక ‘ఆలుమగలు’ నిర్మాత ఏ.వి. సుబ్బారావు “పాట ఎప్పుడిస్తావయ్యా…” అంటే “ఎరక్కపోయి వచ్చాను… ఇరుక్కుపోయాను…” అన్నారట వేటూరి. అదే పాటగా రాయమన్నారు. ఆ పాట కూడా జనానికి పరమానందం పంచింది. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీమద్విరాటపర్వము’లో బృహన్నల, ఉత్తరకు నాట్యం నేర్పే సమయంలో “ఆడవే హంస గమనా…” అంటూ పల్లవించారు వేటూరి. ఆ చిత్రానికి యన్టీఆర్ నిర్మాత, దర్శకుడు. దాంతో ఆయనకు ఎవరైనా నాట్యకత్తెను ‘మయూరి’తో పోలుస్తారు కదా, మరి వేటూరి వారు ‘హంస’తో పోల్చారే అని అనుకున్నారట. ఆయన సందేహాన్ని వేటూరి ఇలా నివృత్తి చేశారు – “సూర్యగమనాన్ని అనుసరించి మనం కాలాన్ని ‘హంస’లలో కొలుస్తాము… అందుకే ‘ఆడవే హంసగమనా…’ అంటూ కాలానుగుణంగా సాగమని సూచించాను. ఇక సూర్యకాంతితోనే జాబిల్లి వెలుగుతూ ఉంటుంది. కాబట్టి “నడయాడవే ఇందువదనా…” అని రెండో పంక్తి రాశాను”. వేటూరి కవిచాతుర్యానికి నందమూరి పరమానంద భరితులయ్యారట! ఇక పెదనాన్న ప్రభాకర శాస్త్రి వద్ద నేర్చిన పదవిన్యాసాలను “వాగార్థావివ సంపృక్తౌ.” శ్లోకంలోనూ “వందే పార్వతీపరమేశ్వరౌ…” అంటూ పార్వతీపరమేశ్వరులకు వందనం చేసేలా చేశారు. అదే పదాలను “వందే పార్వతీప…” అంటే పార్వతీపతికి వందనం… “రమేశ్వరౌ…” అంటే రమాపతి విష్ణువుకూ వందనం అన్నట్టుగా విరిచారు. ‘సాగరసంగమం’లో ఈ విన్యాసం పులకింప చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి వాణిలో ఒలికిన ముత్యాలెన్నో! వాటిని ఏరుకుంటూనే తెలుగువారు పులకించిపోతూ ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ‘నంది’ అవార్డుల్లో ఉత్తమ గీతరచయిత విభాగాన్ని 1977లో ప్రవేశ పెట్టింది. ఆ విభాగంలో ‘పంతులమ్మ’ చిత్రంలోని “మానసవీణ మధుగీతం…” పాటతో తొలి నందిని అందుకున్న ఘనతను సొంతం చేసుకున్నారు వేటూరి. మొత్తం ఆరు సార్లు నంది అవార్డుల్లో ఉత్తమ గీతరచయితగా నిలిచారు సుందరరామమూర్తి. శ్రీశ్రీ తరువాత దాదాపు 17 ఏళ్ళకు ‘మాతృదేవోభవ’ చిత్రానికి వేటూరి రాసిన “రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే…” పాటకే జాతీయ అవార్డు లభించింది. ప్రభుత్వ అవార్డులే కాదు వేటూరి పాటలకు ప్రజల రివార్డులు ఎన్నెన్నో లభించాయి. ఆయన పాటలతోనే పలు చిత్రాలపై వసూళ్ళ వర్షం కురిసింది. ఆయన పాటలతోనే నాటి వర్ధమాన కథానాయకులు ‘తారాపథం’ చూడగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే వేటూరి పాటల మహత్తుతో వెలిగిన వైభవాలు అనేకం కనిపిస్తాయి. అందుకే తెలుగు మాట ఉన్నంత వరకు వేటూరి పాట కూడా వెలుగొందుతూనే ఉంటుందని చెప్పవచ్చు.