సుమంత్ సైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా లంకా శశిధర్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో పాన్ ఇండియా చిత్రంగా ‘కనకదుర్గ’ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో గురువారం ఘనంగా జరిగాయి. ఈ చిత్రంలో కనకదుర్గ అమ్మవారిగా వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తుండటం విశేషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు అంబికా కృష్ణ, డి. యస్. రావు, సైలేంద్ర బాబు, మురళీ మోహన్, గోపి ఆచంట, దాము ప్రసాద్, శ్రీధర్ రెడ్డి, శివ శక్తి దత్త నరసింహరాజు, డాక్టర్ ప్రదీప్ జోషి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం సైలేంద్ర బాబు స్క్రిప్ట్ అందించగా, అంబికా కృష్ణ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి. యస్. రావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ, ”లంక శివశంకర్ ప్రసాద్ ఇంతకుముందు చాలా సినిమాలు తీశారు. దీనిని కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. చాలా ముఖ్యమైన పాత్రను ఇందులో చేస్తున్నాను. మంచి టైటిల్ తో, మంచి మనసు ఉన్న మనుషులతో వస్తున్న చిత్రమిది” అని అన్నారు. చిత్ర కథానాయకుడు సుమంత్ సైలేంద్ర మాట్లాడుతూ, ”ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. సీనియర్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్, మేఘా ఆకాష్, మురళి మోహన్ గార్లతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు” అని అన్నారు. ఇందులో కొత్త మేఘ ను చూస్తారని, ఈ పాత్ర తనకెంతో నచ్చిందని మేఘా ఆకాశ్ తెలిపింది.