Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి

Shivangi Joshi

Shivangi Joshi

Shivangi Joshi: బుల్లితెరపై చిరునవ్వుతో ప్రేక్షకులను అలరించే నటీనటుల జీవితాల వెనుక ఎన్నో తెలియని బాధలు కూడా దాగి ఉంటాయి. కొన్ని సంఘటనలు కాలం గడిచినా మనసును వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి ఒక చేదు అనుభవాన్ని ప్రముఖ టెలివిజన్ నటి శివాంగి జోషి తాజాగా రియాలిటీ షో ‘లాక్ అప్ 2’లో పంచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిన్నతనంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలతో పాటు, తనపై లైంగిక వేధింపుల ఘటనను వెల్లడిస్తూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’, ‘బర్సాత్’, ‘బడే అచ్చే లగ్తే హై 2’ వంటి సీరియళ్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాంగి జోషి ప్రస్తుతం ‘లాక్ అప్ 2’ రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తన జీవితంలోని అత్యంత బాధాకరమైన సంఘటనలను బయటపెట్టారు. తన తండ్రి వ్యాపారం తీవ్ర నష్టాల్లోకి వెళ్లడంతో ఆస్తులను విక్రయించాల్సి వచ్చిందని, బ్రతకడం కూడా కష్టంగా మారిందని చెప్పారు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కుటుంబాన్ని నిలబెట్టారని, ప్రస్తుతం తానే కుటుంబ బాధ్యతలను తీసుకున్నానని తెలిపారు.

ఆ తర్వాత తన చిన్ననాటి గురించి మాట్లాడుతూ మరింత భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి దత్తత సోదరుడిగా పరిచయమైన వ్యక్తి చిన్నతనంలో తనను అనుచితంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని శివాంగి ఆరోపించారు. ముంబైకి నటిగా రావాలని సిద్ధమవుతున్న రోజుల్లో డ్రైవింగ్ నేర్పిస్తాననే పేరుతో తనను ఒడిలో కూర్చోబెట్టేవాడని, ఆ ప్రవర్తన తనకు అసౌకర్యంగా అనిపించేదని ఆమె వెల్లడించారు. ఒక సందర్భంలో ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఆ వ్యక్తి తన వద్దకు వచ్చి, సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని చెబుతూ అనుచితంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించాడని శివాంగి ఆరోపించారు. నటిగా ఉండాలంటే ఇలాంటి విషయాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నింస్తూ చాలా దారుణంగా ప్రవర్తించాడని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో తాను అతనిని ఎదిరించి కొట్టానని, అనంతరం ఇంటికి వచ్చిన తన తల్లిదండ్రులు పరిస్థితిని గమనించి అతడిని అక్కడి నుంచి పంపించారని కన్నీళ్ళు పెట్టుకన్నారు.

ఆ ఘటన తర్వాత చాలా రోజుల పాటు ఇంటి బయటకు వెళ్లడానికి కూడా భయపడ్డానని, స్కూలుకు వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నానని శివాంగి వెల్లడించారు. ఆ సంఘటన అనంతరం తన తల్లి తన భద్రత విషయంలో ఎప్పుడూ ఆందోళన చెందేదని, కుటుంబ సభ్యులు తనపై మరింత రక్షణగా వ్యవహరించారని తెలిపారు. శివాంగి జోషి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. అయితే ఆమె చేసిన ఆరోపణలపై సంబంధిత వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. అయినప్పటికీ చిన్ననాటి వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడటం, బాధితులు మౌనం వీడి తమ అనుభవాలను పంచుకోవాలనే చర్చకు ఈ ఘటన మరోసారి ఊతమిచ్చింది.