గత వారం విడుదలైన చిత్రాలు నిరాశాజనక ఫలితాలను అందించాయి. భారీ అంచనాలతో వచ్చిన విక్రమ్ ‘కోబ్రా’తో పాటు స్ట్రయిట్ తెలుగు సినిమాలు ‘రంగరంగ వైభవంగా’, ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’, ‘బుజ్జీ… ఇలా రా’, ‘ఆకాశ వీధుల్లో… ‘, ‘డై హార్డ్ ఫ్యాన్’, కన్నడ అనువాద చిత్రం ‘పుష్పరాజ్’… ఏదీ కూడా కమర్షియల్ సక్సెస్ ను అందుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ వారం రావాల్సిన కిరణ్ అబ్బవరం మూవీ ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ వారం వెనక్కి వెళ్ళింది.
ఇక ఈ వారాంతంలో రెండు అనువాద చిత్రాలతో పాటు మొత్తం ఆరు సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ముందుగా 8వ తేదీన ఆర్య ‘కెప్టెన్’ మూవీ వస్తోంది. ఆ వెనుకే శర్వానంద్ నటించిన ద్విభాషా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ తెలుగు, తమిళ భాషల్లో 9వ తేదీ రిలీజ్ కానుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్ కాగా, హీరో తల్లి పాత్రను అమల అక్కినేని పోషించడం విశేషం. అలానే అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘కొత్త కొత్తగా…’ సినిమా; నివాస్ శిష్టు, సారా ఆచార్ జంటగా శివశ్రీ మీగడ దర్శకత్వంలో గౌతమి నిర్మించిన థ్రిల్లర్ ఫిల్మ్ ‘రహస్య’ మూవీ, ‘శ్రీరంగాపురం’ సినిమా కూడా 9వ తేదీ జనం ముందుకు రాబోతున్నాయి.
వీటితో పాటే మోస్ట్ అవైటెడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ కూడా 9వ తేదీనే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దీనిని కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నారు. సౌతిండియన్ లాంగ్వేజెస్ కు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’లో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీరాయ్ కీలక పాత్రలు పోషించారు. సో… ఈ ఆరు చిత్రాలలో దేని వైపు జనం మొగ్గుచూపుతారో చూడాలి.
