‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల ఘనవిజయంతో నందమూరి బాలకృష్ణ ‘నటసింహం’గా అభిమానులకు ఆనందం పంచారు. ఆ రెండు చిత్రాలు ‘ఇండస్ట్రీ హిట్స్’ గా నిలవడమే కాదు, అనేక రికార్డులు నెలకొల్పాయి. వాటిలో ‘సమరసింహారెడ్డి’కి కో-డైరెక్టర్ గా పనిచేసిన గొట్టిముక్కల రామ్ ప్రసాద్ తరువాత బాలకృష్ణ సినిమాతోనే దర్శకుడు కావాలని ఆశించారు. అయితే తొలుత ‘చిరునవ్వుతో’ సినిమాతో మెగాఫోన్ పట్టి, ఆ పై బాలకృష్ణ హీరోగా ‘సీమసింహం’ తెరకెక్కించారు రామ్ ప్రసాద్. 2002 జనవరి 11న ‘సీమసింహం’ జనం ముందు నిలచింది. ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాల్లో నాయికగా నటించిన సిమ్రాన్ ఇందులోనూ హీరోయిన్ గా నటించారు.
‘సీమ సింహం’ కథ ఏమిటంటే – దుర్గాప్రసాద్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఎంతటివారినైనా ఎదిరించే రకం. ఓ ఎమ్.పి. దుర్మార్గాలను అరికట్టడంలో వీరోచితంగా పోరాడతాడు. దుర్గా ప్రసాద్ తండ్రి విశ్వేశ్వరరావు, అతని భార్య తమ తనయుని కీర్తికి పొంగిపోతారు. దుర్గాప్రసాద్ ను హేమ ప్రేమిస్తుంది. పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. ఈ లోగా ఓ పోరాటంలో దుర్గా ప్రసాద్ కాలు పనిచేయకుండా పోతుంది. దాంతో అతని ఉద్యోగం కూడా ఊడుతుంది. అయినా అతణ్ణే పెళ్ళాడాలని భావిస్తుంది హేమ. తరువాత దుర్గాప్రసాద్ కు విశ్వేశ్వరరావు తన కన్నతండ్రి కాదని తెలుస్తుంది . అతని కన్నతండ్రి చంద్రశేఖర్ అనే పోలీస్ అధికారి. చంద్రశేఖర్ స్వార్థంతో తన మిత్రుని తనయుని మరణానికి కారకుడై ఉంటాడు. దుర్గా ప్రసాద్ అసలు పేరు సింహప్రసాద్. తన కొడుకు చావుకు కారకుడైన చంద్రశేఖర్ కొడుకునూ చంపాలని ధనంజయ్ తిరుగుతూ ఉంటాడు. విశ్వేశ్వరరావు దుర్గాను ఎలా చేరదీశాడు, ఎలా పెంచి పెద్ద చేశాడు అన్నది అంతకు ముందు సాగిన కథ. చివరకు దుర్గా ప్రసాద్ కు పక్షవాతం నయమవుతుంది. తన గతం తెలుసుకున్న దుర్గాప్రసాద్, తానుగా వెళ్ళి చంద్రశేఖర్ తనయుడైన తనను చంపి కక్షతీర్చుకోమని ధనంజయ్ ను కోరతాడు. ధనంజయ్ భార్య పక్షవాతానికి గురైనప్పుడు దుర్గాప్రసాద్ సాయం చేసి ఉంటాడు. దాంతో ఆమె వచ్చి, అతను తమ కొడుకులాంటి వాడు అని చెబుతుంది. ధనంజయ్ మనసు కరుగుతుంది. ఈ లోగా దుర్గాప్రసాద్ పై పగబట్టిన ఎమ్.పి. అనుచరులు రావడం, వారిని హీరో మట్టుపెట్టడం సాగుతాయి. చివరకు విడిపోయిన చంద్రశేఖర్, ధనంజయ్ ఒకటవుతారు. దుర్గాప్రసాద్ తన ప్రేయసి చేయి అందుకుంటాడు.
‘సీమసింహం’ చిత్రంలో కె.విశ్వనాథ్, చరణ్ రాజ్, రఘువరన్, జయప్రకాశ్ రెడ్డి, పి.వాసు, సాయికుమార్, రీమాసేన్, జయప్రకాశ్ రెడ్డి, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, శివపార్వతి, అన్నపూర్ణ, ఆనంద్ రాజ్, రావు రమేశ్, సుజాత, వెన్నిరాడై నిర్మల, ఎల్బీ శ్రీరామ్, రఘునాథ్ రెడ్డి తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య, జె.భగవాన్ నిర్మించారు. ఈచిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు రాయగా, కథను చిన్నికృష్ణ సమకూర్చారు. మణిశర్మ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సీతారామశాస్త్రి, భువనచంద్ర, చంద్రబోస్, శ్రీనివాస్ పాటలు రాశారు. “మంచితనం ఇంటిపేరు…”, “రెండు జెళ్ళ పాపా…”, “పోరీ హుషారుగుందిరో…” వంటి పాటలు అలరించాయి. బాలకృష్ణ సినిమా టైటిల్స్ లో ‘సింహ’ అన్న పేరు చోటు చేసుకుంటే విజయం అని ఆశించిన అభిమానులకు ఈ చిత్రం నిరుత్సాహం కలిగించింది.