Site icon NTV Telugu

Silambarasan: ఇది ‘ముత్తు’ జీవిత కథ ఆరంభం మాత్రమే!

Muttu

Muttu

 

శింబు, గౌతమ్ వాసుదేవ మీనన్ ది హిట్ కాంబినేషన్. వారిద్దరి కాంబోలో రాబోతున్న కొత్త సినిమా ‘వెందు తనిందదు కాడు’. గురువారం ఈ సినిమా తమిళంలో విడుదల కాబోతుండగా, తెలుగులో ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’గా డబ్ అయ్యి 17వ తేదీ జనం ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా బుధవారం మూవీ తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ముత్తు అనే ఓ వ్యక్తి జీవిత కథ ఇది. అయితే మొత్తం కథంతా ఇందులో చూపించలేదు. ఇది ఆరంభం మాత్రమే. అంటే పార్ట్ 1 అన్నమాట. బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో ముత్తు గురించిన పరిచయం, అతని జీవనయానం ఈ ట్రైలర్ లో పొందుపరిచారు. ఒంటరి ప్రయాణం మొదలు పెట్టిన ఓ కుర్రాడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఈ సినిమా. నేర ప్రపంచంలోకి అడుగుపెట్టి అక్కడ రారాజుగా ఎలా ఎదిగాడనేది ఇందులో మనం చూడొచ్చు. ‘నిజం చెప్పడం కథ అల్లడం కంటే కష్టం’ అంటూ మొదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ముత్తు గురించి చెబుతూ, ‘ఇది కథ కాదు జీవితం.

అర్థం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు’ అనడంలోనే ఈ సినిమాలోని సన్నివేశాలు ఎలా ఉండబోతున్నాయో దర్శకుడు వాసుదేవ మీనన్ చెప్పకనే చెప్పాడు. అలానే ‘ఇది చూసే వాళ్ళకు కథగా కనిపించవచ్చు గానీ అతనికి సంబంధించి ఆట’ అని అనడంలో ముత్తు పాత్ర స్వభావాన్ని చెప్పేశాడు. శింబు, సిద్ధీ ఇద్నానీ, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను తెలుగువారి ముందుకు శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ తీసుకొస్తోంది. ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని సమకూర్చడం విశేషం.

 

Exit mobile version