Chandan Kumar: కన్నడ సీరియల్ హీరో చందన్ కుమార్ పై వేటు పడింది. అతడిని తెలుగు ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేస్తున్నట్లు తెలుగు టీవీ పెడరేషన్ ప్రకటించింది కన్నడ సీరియల్ హీరో చందన్ కుమార్ తెలుగులో సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సీరియల్ మంచి పేరు తీసుకురావడంతో అతనికి శ్రీమతి శ్రీనివాస్ సీరియల్ లో అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఈ సీరియల్ విజయవంతంగా నడుస్తోంది. ఇక ఒక్క సీరియల్ హిట్ అవ్వడంతో చందన్ కు అహంకారం ఎక్కువయ్యింది. షూటింగ్ లకు ఏ టైమ్ కు పడితే ఆ టైమ్ కు రావడం, సెట్ లో ఉన్నవారిని గౌరవించకపోవడం లాంటివి చేస్తూ తాను లేకపోతే సీరియల్ లేనట్లు బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం అసిస్టెంట్ డైరెక్టర్ ను బూతులు తిట్టడమే కాకుండా అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో తెలుగు డైరెక్టర్స్ యూనియన్ చందన్ కు తగిన రీతిలో బుద్ది చెప్పింది.
సెట్ లో ఉండగానే అతడిపై అసిస్టెంట్ డైరెక్టర్ చేయి చేసుకోవడం, చందన్ షూటింగ్ నుంచి వెళ్లిపోవడం జరిగాయి. ఇక ఇక్కడితో ఈ వివాదం ముగిసింది అనేలోపు చందన్ మరోసారి తన పొగరు చూపించినట్లు తెలుస్తోంది. కన్నడ మీడియా ముందు తెలుగు ఇండస్ట్రీని, తెలుగు నటులను అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మాట్లాడడం చర్చనీయాంశమైంది.దీంతో ఆగ్రహించిన తెలుగు టీవీ పెడరేషన్ అతడిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఒక చిన్న విషయమని, చందన్ సారీ చెప్పి ఉంటే వదిలేసేవాళ్లమని, కానీ అతడు కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడడం క్షమించరానిదిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెడరేషన్ సభ్యులు తెలిపారు.