Isakapatnam: ఒకప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ఎక్కువగా హిందీ వెబ్ సిరీస్‌లే శాసించేవి. దక్షిణాది భాషల్లో రూపొందిన కంటెంట్ కూడా మంచి ఆదరణ పొందినా, దేశవ్యాప్తంగా ట్రెండింగ్ జాబితాలో మాత్రం అరుదుగా కనిపించేది. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. కంటెంట్, ఆకట్టుకునే నటన ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని మరోసారి నిరూపిస్తోంది తెలుగు వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’. జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ క్రైమ్ అండ్ పవర్ డ్రామా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్ జాబితాలో టాప్-3లో కొనసాగుతూ తెలుగు కంటెంట్‌కు కొత్త గుర్తింపును తీసుకొస్తోంది.
ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను తన ప్రపంచంలోకి తీసుకెళ్తోంది. క్రైమ్, రాజకీయాలు, అధికారం, సెంటిమెంట్ వంటి అంశాలతో కథను నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రతి ఎపిసోడ్ ముగింపులో వచ్చే ట్విస్టులు తర్వాత ఏమవుతుందనే ఆసక్తిని పెంచుతూ బింజ్ వాచ్ చేయించేలా కథనం సాగుతోంది. ఈ సిరీస్‌కు దర్శకుడు గ్యారీ బి.హెచ్ తన శైలితో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. థియేటర్‌లో సినిమా చూస్తున్న అనుభూతి కలిగించేలా ప్రతి ఫ్రేమ్‌ను తీర్చిదిద్దడంలో దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టెక్నికల్ క్వాలిటీ ప్రతి విషయంలోనూ రాజీ పడకుండా రూపొందించడంతో ‘ఇసకపట్నం’ ఓటీటీ ప్రమాణాలను మరోస్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘తమడా మీడియా’ బ్యానర్‌పై రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభిస్తోంది.
నటీనటుల విషయానికి వస్తే ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని తమ అనుభవాన్ని మరోసారి చాటుకున్నారు. క్యారెక్టర్ లో పూర్తిగా ఒదిగిపోయిన వారి నటన సిరీస్ కు మరింత బలం చేకూర్చింది. సునీల్, నరేశ్ అగస్త్య తదితరులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేయడంతో ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ‘ఇసకపట్నం’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, నిర్మాత డి. సురేష్ బాబు, దర్శకులు వి.వి. వినాయక్, హరీష్ శంకర్, హీరోలు నాగ చైతన్య, సుధీర్ బాబు, తేజ సజ్జా వంటి పలువురు ఈ సిరీస్‌ను అభినందిస్తూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల నుంచి ఇలాంటి స్పందన రావడం కూడా ఈ సిరీస్ విజయానికి మరో నిదర్శనంగా నిలుస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’ రాబోయే రోజుల్లో మరింత భారీ వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి కథ, బలమైన నటీనటులు ఉంటే తెలుగు కంటెంట్ కూడా జాతీయ స్థాయిలో సత్తా చాటగలదని ఈ వెబ్ సిరీస్ మరోసారి నిరూపించింది. ఇదే జోరు కొనసాగితే ఓటీటీ చరిత్రలో అత్యధికంగా వీక్షించబడిన తెలుగు వెబ్ సిరీస్‌లలో ‘ఇసకపట్నం’ ఒకటిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

