Site icon NTV Telugu

Sai Dhanshika: తెలుగులో ‘దక్షిణ’ చెల్లించుకోబోతున్న తమిళ పొన్ను!

Sai Dhanshika

Sai Dhanshika

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’లో యాక్షన్ స్టార్ గా కనిపించిన సాయి ధన్సికలో గ్లామర్ యాంగిల్ కూడా ఉంది. ఇంతకాలం తమిళ చిత్రాలకే పరిమితమైన ఆమెకు ఇప్పుడు తెలుగులోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే సాయి ధన్సిక హీరోయిన్ గా నటించిన రొమాంటిక్‌ ఎంటర్ టైనర్ ‘షికారు’ మూవీ విడుదలైంది. ఇప్పుడు తెలుగులో మరో సినిమాలో సాయి ధన్సిక నటిస్తోంది. ఛార్మి ప్రధాన పాత్రధారిణిగా ‘మంత్ర, మంగళ’ చిత్రాలను రూపొందించిన ఓషో తులసీరామ్ సాయి ధన్సికతో ‘దక్షిణ’ అనే లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. దీనిని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్‌ షిండే నిర్మిస్తున్నాడు. బుధవారం పూజా కార్యక్రమాలతో పాటు సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం మొదలైంది.

హైదరాబాద్ లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీలో సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత వంశీకృష్ణ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, ప్రణతి, శ్వేతా భావన క్లాప్ ఇచ్చారు. చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ, ”సాయి ధన్సిక, ఓషో తులసీరామ్ కలయికలో సినిమా చేయడం సంతోషంగా ఉంది. తెలుగులో ‘మంత్ర’, ‘మంగళ’ ఫిమేల్ ఓరియెంటెడ్ థ్రిల్లర్స్ ట్రెండ్ సెట్ చేశాయి. ఆ సినిమాల తరహాలో ‘దక్షిణ’ ఉంటుంది. మూడు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేశాం. తొలి షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు షూటింగ్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 6 నుంచి 20వ తేదీ వరకు ప్లాన్ చేశాం. మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో నవంబర్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది” అని చెప్పారు.

Exit mobile version