NTV Telugu Site icon

Tamannaah Bouncers: రెచ్చిపోయిన బౌన్సర్.. మీడియాపై దాడి.. అసలేం జరిగింది?

Tamannaah Bouncers

Tamannaah Bouncers

Tamannaah Bouncers Attack On Media In Annapurna Studios: హీరో-హీరోయిన్లు అభిమానులు ఎవరైనా హద్దుమీరి ఎగబడితే, వారిని అడ్డుకోవడమే బౌన్సర్ల పని. కానీ.. ఇక్కడ తమన్నా బౌన్సర్లు రివర్స్‌లో మీడియాపై దాడికి దిగి, అత్యుత్సాహం ప్రదర్శించారు. తమన్నా ఇంటర్వ్యూ తీసుకోవడానికి కొందరు ప్రయత్నించినప్పుడు, వాళ్లు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో.. వాళ్లు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమన్నా టైటిల్ రోల్‌లో బబ్లీ బౌన్సర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం అన్నపూర్ణ స్టూడియోస్‌కి వచ్చారు.

అప్పుడు మీడియా ప్రతినిధుల్లో కొందరు తమన్నాతో ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించారు. ఇదే సమయంలో తమన్నా వీడియోలు తీసేందుకు కూడా ప్రయత్నించారు. అక్కడే ఉన్న బౌన్సర్స్ ముందుకొచ్చి, వీడియోలు తీయొద్దని వాగ్వాదానికి దిగారు. తాము మీడియా ప్రతినిధులమని చెప్తున్నా.. పర్మిషన్ లేదంటూ రెచ్చిపోయారు. అది చినికి చినికి గాలివానగా మారడంతో.. బౌన్సర్లు దాడి చేశారు. ఒకరైతే, అక్కడే ఉన్న డస్ట్ బిన్‌ని మీడియా ప్రతినిధులపై విసిరే ప్రయత్నం చేశాడు. పక్కనే ఉన్న వ్యక్తి ఆ పని చేయొద్దని వారించడంతో, పక్కన పెట్టేశాడు. ఈ గొడవ గురించి తెలుసుకున్న సినిమా యూనిట్.. వెంటనే అక్కడికి చేరుకొని, పరిస్థితిని అదుపు చేశారు. ఈ దాడిలో ఇద్దరు కెమెరామెన్లు గాయపడ్డారు.

కాగా.. మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా లేడీ బౌన్సర్‌గా నటించింది. ఓ కోటీశ్వరుడికి లేడీ బౌన్సర్‌గా వ్యవహరిస్తుంది. కామెడీతో కూడిన యాక్షన్ కథాచిత్రంగా సాగే ఈ సినిమా.. సెప్టెంబర్ 23వ తేదీన డిస్నీ+ హాట్‌స్టార్‌లో విడుదల అవుతోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు దర్శకుడు పేర్కొన్నాడు. ఇందులో సౌరభ్ శుక్లా, అభిషేక్ బజాక్ కీలక పాత్రల్లో నటించారు.