దక్షిణాదిలో ఆంక్షలు.. హిందీలో స్వేచ్ఛ.. తమన్నా షాకింగ్ కామెంట్స్!

Tamannaah Bhatia (2)

Tamannaah Bhatia (2)

Tamannaah Bhatia: రెండు దశాబ్ధాలపాటు సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నటి తమన్నా భాటియా. ఇటీవల ఫోర్బ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మిల్కీ బ్యూటీ తన అనుభవాలను పంచుకున్నారు. హిందీ చిత్రసీమలో నటీనటులు తమకు నచ్చిన పాత్రలను ఎంచుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. పాటలు, డ్యాన్స్‌లు, గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకునే అవకాశం అక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అలాంటి పాత్రల్లో నటులు తమ ప్రతిభను మరింత బలంగా చాటుకునే అవకాశం లభిస్తుందని, ప్రేక్షకులు కూడా అలాంటి పాత్రలను ఆదరిస్తారని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో దక్షిణాది చిత్రసీమ గురించి కూడా తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటిసారి సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు అక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా అనిపించిందని వెల్లడించారు. కొందరు దీనిని పురుషాధిక్యతగా భావించవచ్చని చెప్పినా, తన దృష్టిలో అది కమర్షియల్ సినిమా వ్యవస్థకు సంబంధించిన అంశమని వివరించారు. దక్షిణాది చిత్రసీమ వాణిజ్యపరంగా నిలదొక్కుకోవడానికి కొన్ని ప్రమాణాలు, స్టార్ క్వాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని తమన్నా అభిప్రాయపడ్డారు. అంటే అక్కడ కేవలం నటన మాత్రమే కాకుండా ప్రేక్షకులను ఆకర్షించే కమర్షియల్ అంశాలు కూడా కీలకమని ఆమె తన మనసులో మాటను బయటపెట్టారు.

అయితే ఈ వ్యాఖ్యలను ఏ పరిశ్రమపై విమర్శగా చూడకూడదని తమన్నా స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత అనుభవమని, ప్రతి నటుడు లేదా నటి అనుభవం భిన్నంగా ఉండవచ్చని చెప్పారు. దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల పాటు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న నటీమణులు కెరీర్‌ను నిలబెట్టుకోవాలంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, మరోవైపు కమర్షియల్ సినిమాల్లో పాటలు, గ్లామర్ పాత్రల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుందని ఆమె వివరించారు. తమన్నా కెరీర్ కూడా ఈ రెండు ప్రపంచాల మధ్య ఉదాహరణగానే నిలుస్తుంది. తెలుగు, తమిళ చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తరువాత హిందీ సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి కాలంలో కథా ప్రాధాన్యత ఉన్న పాత్రలతో పాటు కమర్షియల్ ప్రాజెక్టులను కూడా సమానంగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఆమె కెరీర్‌లో ఇటీవల భారీ గుర్తింపు తెచ్చుకున్న ప్రాజెక్టుల్లో ‘స్త్రీ 2’ చిత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సినిమాలోని ‘ఆజ్ కీ రాత్’ పాట దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సాంగ్ యూట్యూబ్‌లో 1 బిలియన్‌కు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. దీంతో తమన్నా మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారు. తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు ప్రతి చిత్ర పరిశ్రమకు తనదైన పని విధానం ఉంటుందని అంటున్నారు.