Surya Birthday Special :
సూర్య విలక్షణమైన అభినయం తెలుగువారిని కట్టిపడేస్తోంది. అనువాద చిత్రాలతోనే తెలుగు నేలపైనా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు సూర్య. మరి ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ఎప్పుడూ ముందుంటారు కదా! సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే సూర్యకు తమిళనాడులో కన్నా ఇక్కడే మంచి క్రేజ్ ఉందనవచ్చు.
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. 1975 జూలై 23న మద్రాసులో జన్మించారు సూర్య. ప్రముఖ తమిళనటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగు పెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో పరిచయమైన సూర్య, ‘నందా’తో నటునిగా గుర్తింపు సంపాదించారు. ‘కాక్క కాక్క’తో మంచి విజయం చూశారు. ఈ సినిమా తెలుగులో వెంకటేశ్ హీరోగా ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ అయింది. మరో విలక్షణ నటుడు విక్రమ్ తో కలసి సూర్య నటించిన ‘పితామగన్’ మంచి పేరు తెచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘శివపుత్రుడు’గా అనువాదమై మంచి విజయం సాధించింది. అప్పటి నుంచీ తెలుగులోనూ సూర్యకు మంచి ఆదరణ లభించసాగింది. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘గజిని’తో సూర్యకు స్టార్ స్టేటస్ లభించింది. ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై సూర్యను తెలుగువారికి మరింత దగ్గర చేసింది.
సూర్య డబ్బింగ్ సినిమాలు “యువ, ఆరు, సింగమ్ సీరీస్, సెవెంత్ సెన్స్, 24, ఎన్.జి.కె, గ్యాంగ్” వంటి చిత్రాలు ఆకట్టుకున్నాయి. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్తచరిత్ర’ తెలుగు, హిందీ ద్విభాషా చిత్రంలో సూర్య ఏటూరి సూర్యనారాయణ రెడ్డి పాత్రలో అలరించారు. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంటున్నారు. సూర్య భార్య జ్యోతిక కొన్ని తెలుగు చిత్రాలలో నటించి అలరించింది. తెలుగు దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో అనువాదమయింది. సూర్య నిర్మాతగానూ అనేక చిత్రాలు నిర్మించారు. ఈ సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ మూవీస్ గా అలరించాయి. సూర్య నటించి, నిర్మించిన ‘జై భీమ్’ భలేగా ఆకట్టుకుంది. ఈ యేడాది వచ్చిన సూర్య సినిమా ‘ఇ.టి.- ఎవరికీ తలవంచను’ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కమల్ హాసన్ ‘విక్రమ్’లో సూర్య నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ‘యువ’లో తనతో కలసి నటించిన మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘రాకెట్రీ: నంబి ఎఫెక్ట్’లో సూర్య తనలాగే గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. సూర్య నటించిన ‘వనంగాన్’ తెలుగులో ‘అచలుడు’ పేరుతో తెరకెక్కుతోంది. ఒకే రోజున ఈ ద్విభాషా చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమాతో సూర్య ఏ తీరున అలరిస్తారో చూడాలి.
