Suman: రీల్ హీరో కాదు.. రియల్ హీరో! సైనికుల కోసం సుమన్ చేసిన గొప్ప త్యాగం ఏమిటో తెలుసా?

Suman

Suman

Suman: కొంతమంది హీరోలు వెండితెరపై మాత్రమే హీరోలు. మరికొందరు మాత్రం నిజ జీవితంలోనూ తమ పనులతో ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి వ్యక్తిత్వం కలిగిన నటుల్లో సీనియర్ నటుడు సుమన్ పేరు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది. దశాబ్దాల క్రితం చేసిన ఓ గొప్ప దానం గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోట్లాది రూపాయల విలువైన భూమిని దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల కుటుంబాల కోసం ఎలాంటి ప్రచారం లేకుండా విరాళంగా ఇచ్చిన విషయం తెలిసి అభిమానులు ఆయనను నిజమైన రియల్ హీరోగా కొనియాడుతున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో సామాజిక సేవకు పెద్దపీట వేసిన నటులు చాలామందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంకుల ద్వారా లక్షలాది మందికి సేవలు అందిస్తుండగా, నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. మరికొందరు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు నిర్వహిస్తూ సమాజానికి అండగా నిలుస్తున్నారు. అయితే వీరిలో కొందరు తమ సేవలను ప్రచారం చేయకుండా సైలెంట్ గానే కొనసాగిస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో సుమన్ కూడా ఒకరని ఇప్పుడు మరోసారి స్పష్టమైంది.

ఒకప్పుడు తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన సుమన్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌కు సమీపంలోని భువనగిరి ప్రాంతంలో సుమారు 170 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిపై భారీ సినిమా స్టూడియో నిర్మించి, తర్వాత దానిని కమర్షియల్ గా డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూముల విలువ ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో ఆ స్థలం విలువ వందల కోట్ల రూపాయలకు చేరిందని భావిస్తున్నారు.

అయితే అదే సమయంలో దేశాన్ని కుదిపేసిన కార్గిల్ యుద్ధం జరిగింది. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన భారత జవాన్ల త్యాగం సుమన్‌ను తీవ్రంగా కదిలించింది. అమర వీరుల కుటుంబాల బాధను చూసిన ఆయన, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తన వంతుగా ఏదైనా చేయాలని అనుకున్నారు.  ఆ సమయంలో ఆయన భార్య భువనగిరిలో ఉన్న 170 ఎకరాల భూమిని సైనికుల సంక్షేమం కోసం అందిస్తే మంచిదని సూచించగా, సుమన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ భూమిని పూర్తిగా సైనికుల అవసరాల కోసం విరాళంగా ఇచ్చేశారు.

అయితే ఈ  విషయాన్ని ఆయన ఎన్నడూ ప్రచారం చేసుకోలేదు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం ప్రస్తావనకు రావడంతో సుమన్ స్వయంగా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఈ నిర్ణయం వెనుక తన భార్య ఆలోచనే ప్రధాన కారణమని ఎంతో వినమ్రంగా చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా ఎలాంటి గుర్తింపు ఆశించకుండా చేసిన ఈ సహాయం గురించి తెలుసుకున్న తర్వాత అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలు, ఒడిదుడుకులు చూసిన సుమన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే నిజ జీవితంలోనూ ఆదర్శంగా నిలిచారని సోషల్ మీడియాలో అనేక మంది అభిప్రాయపడుతున్నారు.