Subhash Palekar Biopic With Prakash Raj: భారతదేశంలో ప్రకృతి వ్యవసాయ పితామహునిగా పేరు తెచ్చుకున్న సుభాష్ పాలేకర్ జీవిత గాథను వెండితెరకెక్కించాలని ఆ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న విజయ్ రామ్ కోరుకుంటున్నారు. 1949 ఫిబ్రవరి 2న మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని బెలోరా గ్రామంలో పుట్టిన సుభాష్ పాలేకర్ వ్యవసాయం మీద మక్కువతో దానినే జీవికగా చేసుకున్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలనే సత్ సంకల్పంతో ప్రకృతి వ్యవసాయ విధానానికి బీజం వేశారు. రసాయనాలతో సంబంధం లేకుండా, గో సంపదతో ప్రకృతి వ్యవసాయాన్ని తాను స్వయంగా చేస్తూ, దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో పర్యటిస్తూ, రైతులలో ఆర్గానిక్ ఫామింగ్ మీద అవగాహన కలిగిస్తున్నారు. ఆ విధానం నచ్చిన ఆయన సలహాలు, సంప్రదింపులతో అదే బాట పట్టారు తెలుగువారైన విజయ రామ్. రెండు తెలుగు రాష్ట్రాలలోని రైతులకు ఈ విధానం గురించి, తెలియచేస్తూ, వారితో ప్రకృతి వ్యవసాయం చేయించడాన్ని ఓ ఉద్యమంగా విజయ రామ్ స్వీకరించారు.
ఇందూరు తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించి, దానితో పాటు ఆధ్యాత్మిక ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు నరసింహా రెడ్డికీ విజయ రామ్ సలహాలిస్తున్నారు. అక్టోబర్ 9వ తేదీ ఈ వ్యవసాయ క్షేత్రాన్ని జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ సందర్శించారు. ఈ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన వెబ్ సైట్ నూ ప్రకాశ్ రాజ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ ను సుభాష్ పాలేకర్ బయోపిక్ లో నటించాల్సిందిగా విజయ రామ్ కోరారు. ఏడు పదుల వయసులో వయో భారాన్ని లెక్కచేయకుండా సుభాష్ పాలేకర్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని, ప్రకృతి వ్యవసాయం గురించి రైతులలో అవగాహన కలిగిస్తున్నారని, ఇప్పటికే ఆయన రాసిన యాభైకు పైగా పుస్తకాలను విద్యావంతులైన రైతులు అధ్యయనం చేస్తున్నారని చెప్పారు. అయితే ప్రకాశ్ రాజ్ లాంటి ప్రముఖ నటుడు సుభాష్ పాలేకర్ బయోపిక్ లో నటిస్తే… ఆ సందేశం కోట్లాది మందిని సులువుగా చేరుతుందని విజయ్ రామ్ అన్నారు. అంతేకాదు… ఈ చిత్ర నిర్మాణం కోసం తమ వంతుగా కోటి రూపాయలు ఇవ్వడానికీ సిద్థమని చెప్పారు. దిల్ రాజు సమక్షంలో జరిగిన ఈ సంభాషణను ప్రకాశ్ రాజ్ మనసులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సుభాష్ పాలేకర్ గారిని కర్ణాటకలో ఇప్పటికే ఓ సారి కలిశానని, ఆయన శిష్యులతో తరచూ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి తాను చర్చిస్తుంటానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. దీంతో సుభాష్ పాలేకర్ బయోపిక్ కు ప్రకృతి ప్రేమికుడైన ప్రకాశ్ రాజ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ఆశాభావాన్ని విజయ రామ్ వ్యక్తం చేశారు.