NTV Telugu Site icon

Spielberg-Tom Cruise: కలుసుకున్న స్పీల్ బెర్గ్ – టామ్ క్రూయిజ్ !

Spielberg Tom Cruise

Spielberg Tom Cruise

Spielberg – Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం ‘మైనారిటీ రిపోర్ట్’ మంచి విజయం సాధించింది. తరువాత వారిద్దరి కలయికలో ‘వార్ ఆఫ్ ద వరల్డ్స్’ వెలుగు చూసింది. తొలి చిత్రం స్థాయి విజయం కాకపోయినా ఈ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. నిజానికి ఈ సినిమా ఫలితం కారణంగానే స్టీవెన్ తో టామ్ కు మాటల్లేకుండా పోయాయని అనుకుంటారు. కానీ, అసలు విషయం వేరే ఉందట!

Read Also: Oscar 2023: ఆస్కార్ ఆశలు రేపుతున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్’!

మన తెలుగు సినిమాల విడుదల సమయంలో టాక్ షోలలో ఎలా నటీనటులు పాల్గొని తమ చిత్రాల ప్రచారం చేసుకుంటారో, అదే తీరున ఓఫ్రా విన్ ఫ్రే షోలో హాలీవుడ్ నటీనటులు తమ కొత్త సినిమాల కోసం పాల్గొంటూ ఉంటారు. అలా ‘వార్ ఆఫ్ ద వరల్డ్స్’ సినిమా ప్రచారంలో భాగంగా విన్ ఫ్రే షోకు టామ్ వెళ్ళాడు. అక్కడ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెంగున ఎగిరి విన్ ఫ్రే చెంతన సోఫాలో కూర్చుని, అప్పటి తన గర్ల్ ఫ్రెండ్ కేటీ హోమ్స్ గురించి ముచ్చటించాడట టామ్. ఇదే స్టీవెన్ కు నచ్చని విషయం. ఇదిలా ఉంటే మాట్ లాయిర్ నిర్వహించే ‘టు డే’ షోలోనూ టామ్ వింతగా మాట్లాడడట! ఓ నాటి అందాల తార, ‘ద బ్లూ లాగూన్’ ఫేమ్ బ్రూక్ షీల్డ్స్ మానసిక చికిత్స కోసం తీసుకుంటున్న మందుల గురించీ చర్చించాడట. టామ్ క్రూయిజ్ కు మతపరమైన కట్టుబాట్లు ఎక్కువేనట! అందువల్ బ్రూక్ షీల్డ్స్ మందులు వాడడం మంచిది కాదని అన్నాడట. ఈ రెండు విషయాలలో టామ్ పై స్టీవెన్ కు కోపం వచ్చింది. దాంతో అప్పటి నుంచీ వారిద్దరి మధ్య మాటలు లేకుండా పోయాయి. మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే దాదాపు 18 ఏళ్ళకు ఆస్కార్ లంచన్ లో టామ్, స్పీల్ బెర్గ్ మాట కలుపుకున్నారు. అంతేకాదు, ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకుంటూ మాట్లాడారు. మళ్ళీ వారిద్దరి మధ్య మునుపటి బంధం చోటు చేసుకుందని కొందరు సంతోషిస్తున్నారు. త్వరలోనే వీరి కాంబోలో మరో సినిమా ప్రకటన ఉంటుందనీ మరికొందరి మాట! ఏమైనా, ‘మైనారిటీ రిపోర్ట్’ కాంబో మధ్య నెలకొన్న ‘వార్ ఆఫ్ ద వరల్డ్స్’ సమసిపోయిందని హాలీవుడ్ జనం నవ్వుకుంటున్నారు.