శ్రీశ్రీశ్రీ పుట్టపర్తి సాయిబాబాకు దేశ విదేశాలలో కోట్లాది మంది భక్తులున్నారు. వారంతా ఆయన్ని కదిలే దైవంగా భావించేవారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఈనాటికి ప్రజల గుండెల్లో కొలువై ఉన్నారు. ఆయన గురించి రాబోయే తరాలకు తెలియడం కోసం ప్రముఖ దర్శకులు సాయిప్రకాశ్ ‘శ్రీసత్యసాయి అవతారం’ చిత్రం తెరకెక్కించబోతున్నారు. ఆయనకిది 100వ చిత్రం కావడం మరో విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు, ప్రముఖ వైద్యులు దామోదర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ‘శ్రీసత్యసాయి అవతారం’ చిత్రంకు సంబంధించి లోగోను సోమవారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన వేడుకలో మురళీమోహన్, సుమన్, సి. కళ్యాణ్ ఆవిష్కరించారు.
అనంతరం సాయి ప్రకాష్ మాట్లాడుతూ, ”ఈ కథను 1998లో తోటపల్లి మధు రాశారు. ఆ తర్వాత కోడి రామకృష్ణగారు చేపట్టారు. కొన్ని కారణాలవల్ల సినిమా ఆగిపోయింది. ఇప్పుడు స్వామివారి దయ, భక్తుల అనుగ్రహంతో నా దగ్గరకు వచ్చింది. ఈ సినిమా త్వరగా రావాలని భక్తులు కోరుకుంటే వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా బాలకాండ, మహిమా కాండగా తీయనున్నాం. 1925నుంచి 1949 వరకు ఒక భాగంగా, 1949లో ప్రశాంతి నిలయం శంకుస్థాపన చేసినప్పటినుంచి 2011 వరకు మరో భాగంగా వుంటుంది. 180 దేశాల్లో వున్న భక్తులు, భక్తులు కానివారు కూడా ఈ సినిమా చూసి ఆనందపడేట్లుగా తీయాలనుకుంటున్నాం. దసరా తర్వాత షూటింగ్ ప్రారంభిస్తాం. ప్రతి నెలా పదిరోజులపాటు షూటింగ్ చేయాలనుకుంటున్నాం. వచ్చే ఏడాది స్వామివారి పుట్టినరోజున విడుదల చేయాలనే ప్లాన్‌లో వున్నాం” అని అన్నారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ, ”సాయిప్రకాష్ మా గురువుగారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్‌గా చేశాను. 50 ఏళ్ళ సినీ జీవితం ఆయనది. 100వ సినిమాగా సత్యసాయి బాబా సినిమా చేయడం భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తున్నా. దీన్ని స్వామి భక్తులే కాకుండా ప్రపంచం ఆదరించాలి. సాయి సేవాభావంతో చేసిన శాంతి, సహాయం అలవర్చుకోవాలి. ఈ సినిమా చూశాక ప్రతివారూ ఒకరికొకరు సాయం చేసుకోవాలి” అని తెలిపారు.
నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ”నేను ఇలా నిలబడడానికి బాబానే కారణం. చిన్పపుడు తేనంపేటకు స్వామివారు వస్తుండేవారు. మా అమ్మగారు బాగా గారి దగ్గరకు తీసుకెళ్లేవారు. నేను రానని చెప్పేవాడిని. వెళ్ళినా గొడవ చేసేవాడిని. మా అమ్మను స్వామి పిలిచి, వాడే ఒక రోజు నా దగ్గరకు వస్తాడు అన్నారట. అలాంటి నాకు స్వామి పుట్టినరోజుకు పుట్టపర్తికి శాస్త్రిగారి ద్వారా పిలుపు వచ్చింది. అప్పటికీ నా ‘పోలీస్ స్టోరీ’ రాలేదు. పుట్టపర్తిలో స్వామివారు అందరికీ బట్టలు ఇచ్చారు. నా దగ్గరకు వచ్చి నీకేం బట్టలు కావాలన్నారు. మీ ఇష్టం అన్నాను. నాకు సఫారీ సూట్ ఇచ్చారు. నీకు ఐ.ఎ.ఎస్,. ఐ.పి.ఎస్. బాగుంటుంది అన్నారు. ఆ తర్వాతే ‘పోలీస్ స్టోరీ’లో ఛాన్స్ వచ్చింది” అని అన్నారు.
నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ, ”బాబాగారిపై ఎంతోమంది సినిమా చేయాలని ప్రయత్నించారు. అంజలీదేవి గారు ఓ సీరియల్ తీశారు. అందులో నేను బాబాగారి సోదరుడిగా నటించాను. అందుకు గడ్డం వుంటే తీశాను. బాబాగారు 13 ఏళ్ళ వరకు కథను తీయమన్నారు. అప్పట్లో 15 ఎపిసోడ్లుగా వచ్చింది. ఇప్పుడు బంగారం లాంటి అవకాశం సాయిప్రకాష్‌కు, దామోదర్‌కు వచ్చింది. మొదట్లో నాకు బాబాపై నమ్మకం లేదు. పెళ్ళి అయ్యాక నా భార్య పుట్టపర్తి తీసుకెళ్ళమంది. చూద్దామంటూ వాయిదా వేశాను. ఓ సారి అనంతపూర్ కాలేజీ ఫంక్షన్‌కు నేను హాజరయ్యాను. భక్తులంతా నా చుట్టూ కూర్చుకున్నారు. వారినుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. పైసా ఖర్చు లేకుండా చదువు, ఆసుపత్రి సౌకర్యాలు ఇవ్వడం దేవుడికే సాధ్యం అని అనిపించింది. అప్పుడు నా మనసు మారిపోయింది. స్వామివారే అక్కడ ప్రతి విషయంలో కేర్ తీసుకునేవారు. అంజలీదేవిగారు సీరియల్ తీసినప్పుడు నా భార్యతో స్వామివారిని కలిశాను. మొదటిరోజు షూటింగ్‌లో గుమ్మడి, కాంతారావు, రాఘవేంద్రరావు వంటివారు వున్నారు. అప్పుడు స్వామివారు మా పాత్రలను భక్తులకు పరిచయం చేస్తుంటే ఒళ్ళు పులకించింది. అప్పుడు బాబా ఇచ్చిన ఉంగరం ఇప్పటికీ పెట్టుకుంటూనే వున్నాను” అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమన్, బ్రహ్మారెడ్డి, నిర్మాత రాధామోహన్, నటి శివపార్వతి తదితరులు బాబాతో తమకున్న అనుభవాలను తెలిపారు.