Sreeleela: కాబోయే భర్తకు మూడు కండిషన్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Sreeleela

Sreeleela

Sreeleela: చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీలను యాంకర్ ఆమె పెళ్లి, ప్రేమ గురించి ప్రశ్నించారు. దీనికి సరదాగా స్పందించిన ఆమె, ఇప్పటివరకు తనకు ఎవరూ ప్రపోజ్ చేయలేదని నవ్వుతూ చెప్పారు. అందుకు కారణం కూడా ఆసక్తికరంగానే వివరించారు. తన చుట్టూ ఎప్పుడూ ఒక రకమైన ‘అమ్మమ్మ వైబ్స్’ ఉంటాయని తన స్నేహితులు సరదాగా చెబుతుంటారని అన్నారు. తాను కోప్పడినా కూడా ఎవరూ సీరియస్‌గా తీసుకోకుండా నవ్వేస్తారని, బహుశా అందుకే ఇప్పటివరకు ఎవరూ తనతో ఆ దిశగా ముందుకు రాలేదేమో అని చమత్కరించారు. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ఇక కాబోయే జీవిత భాగస్వామి గురించి అడిగిన ప్రశ్నకు శ్రీలీల చాలా పరిణితితో కూడిన సమాధానం ఇచ్చారు. రూపురేఖలు, గ్లామర్ వంటి అంశాలు తనకు పెద్దగా ముఖ్యమేమీ కావని, బాహ్య సౌందర్యం కంటే మనసు అందమే నిజమైన అందమని తాను నమ్ముతానని చెప్పారు. జీవిత భాగస్వామి అంటే కేవలం ప్రేమించే వ్యక్తి మాత్రమే కాకుండా, జీవితాంతం తోడుగా నిలిచే వ్యక్తి కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకే తన భర్తలో మూడు ముఖ్యమైన లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు.

మొదటగా తనను పూర్తిగా అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడే బంధం బలంగా నిలుస్తుందని చెప్పారు. రెండవది, తన సినీ కెరీర్‌కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని పేర్కొన్నారు. నటిగా తన ప్రయాణాన్ని గౌరవించే వ్యక్తే తన జీవిత భాగస్వామి కావాలని ఆమె కోరుకుంటున్నట్లు చెప్పారు. మూడవది, నిజాయితీ తనకు అత్యంత ముఖ్యమైన లక్షణమని వెల్లడించారు. జీవితంలో నమ్మకం, నిజాయితీ లేకపోతే ఏ బంధమూ ఎక్కువకాలం నిలవదని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే తనతో సరదాగా గడిపే, స్నేహితుడిలా ఉండే వ్యక్తినే తాను జీవిత భాగస్వామిగా కోరుకుంటానని చెప్పారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీలీల వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆమె ఆలోచనలను ప్రశంసిస్తూ, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో రూపం కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కెరీర్ పరంగా కూడా శ్రీలీల మంచి జోరులో ఉన్నారు. తెలుగులో తన సినిమాల ఎంపిక విషయంలో కాస్త నెమ్మదించినప్పటికీ, బాలీవుడ్‌లో పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. డ్యాన్స్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.