Sreeleela: టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా అడుగు పెట్టి జోరు పెంచుతోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను శ్రీలీల ముంబైలో మళ్లీ ప్రారంభించినట్లు సమాచారం. చాలా కాలంగా వాయిదాలు పడుతూ కారణంగా వార్తల్లో నిలిచిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మళ్లీ వేగం పుంజుకోవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఈ మోస్ట్ అవేటెడ్ మల్టీ-స్టారర్ రొమాంటిక్ మ్యూజికల్ థ్రిల్లర్ కి ‘తు గై లవ్ కామ్’ (Tu Gaye Love Kaam) పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 2027 జనవరి 26న (గణతంత్ర దినోత్సవం కానుకగా) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ విషయాలు ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తేనే క్లారిటీ రానుంది. టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీక్ సరసన శ్రీలీలతో పాటు సైఫ్ అలీ ఖాన్, వరుణ్ ధావన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదట ‘ఆషికీ 3’గా అనుకున్న ఈ ప్రాజెక్ట్‌ను కొన్ని కాపీరైట్ కారణాల వల్ల సరికొత్త కథతో, ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఒక క్రేజీ లవ్ డ్రామాగా అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు.
ఇందులో శ్రీలీల ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న షెడ్యూల్‌లో పాల్గొంటూ తన సన్నివేశాలను పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ఆమెకు సంబంధించిన కీలక భాగాలను పూర్తి చేసేలా బృందం పనిచేస్తోందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మ్యూజికల్ రాబోయే కాలంలో బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తికరమైన విడుదలల్లో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు చిత్రాల్లో తన డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఈ ప్రాజెక్ట్ కెరీర్‌లో మరో కీలక మలుపుగా మారే అవకాశముంది. అనురాగ్ బసు వంటి దర్శకుడి చేతుల్లో తొలి హిందీ సినిమా చేయడం కూడా ఆమెకు ప్రత్యేకమైన అవకాశంగా చెప్పొచ్చు.
మరోవైపు కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పెద్ద భాగం షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. షెడ్యూల్ సమస్యల కారణంగా గతంలో ఈ సినిమా పలుమార్లు వాయిదా పడినా, ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. అనురాగ్ బసు సినిమాల్లో సంగీతానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుంది. ‘బర్ఫీ’, ‘లూడో’ వంటి చిత్రాల్లో కథను ఆయన నడిపించిన స్టైల్ తో ఈ సినిమాపై కూడా అంచనాలను పెంచుతోంది.
కార్తీక్ ఆర్యన్ ఇటీవల సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ఆయన లైనప్‌లో ‘నాగ్జిల్లా’, ‘భూల్ భూలయ్యా 4’ వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. మరోవైపు శ్రీలీల చివరిసారిగా పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కనిపించారు. త్వరలో ‘ఓం చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్’లో కూడా ఆమె నటించనున్నారు. ముంబై షెడ్యూల్ మళ్లీ ప్రారంభం కావడంతో ఈ భారీ రొమాంటిక్ మ్యూజికల్ ప్రాజెక్ట్ ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల జోడీ, అనురాగ్ బసు దర్శకత్వం, ప్రీతమ్ సంగీతం కలిసి ఈ ప్రేమకథను ఎంత ప్రత్యేకంగా మలుస్తాయో చూడాలనే ఆసక్తి ఇప్పుడు బాలీవుడ్ అభిమానుల్లో మరింత పెరిగింది.

