(అక్టోబర్ 29న ‘భలేదొంగలు’కు 45 ఏళ్ళు పూర్తి)
ఉత్తరాదిన విజయం సాధించిన చిత్రాల ఆధారంగా వందలాది దక్షిణాది సినిమాలు రూపొంది అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మురిపించాయి. టాప్ స్టార్స్ అందరూ హిందీ రీమేక్స్ పై మోజుపడ్డ రోజులవి. హిందీలో శశికపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చోర్ మచాయే షోర్’ ఆధారంగా తెలుగులో కృష్ణ, మంజుల జోడీగా ‘భలే దొంగలు’ చిత్రం తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై జి.సాంబశివరావు, పి.బాజ్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1976 అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.
‘భలేదొంగలు’ కథ విషయానికి వస్తే – కోర్టులో ఇంజనీర్ శేఖర్ ఎంత మొత్తుకున్నా, అతని వాదనలు ఎవరూ వినరు. రేఖ అనే ధనవంతుల అమ్మాయిని రేప్ చేయబోయాడనే నేరంపై అతను జైలుకు వెళతాడు. అక్కడ అతనికి రంగతో పాటు మరో ఇద్దరు దొంగలు పరిచయం అవుతారు. శేఖర్ గతం గుర్తు చేసుకుంటాడు. తాను ప్రేమించిన రేఖ కోటీశ్వరుని కూతురు కావడం వల్ల రాజు-పేద తేడాలు పొడసూపుతాయి. రేఖ తండ్రి మరో రాజకీయనాయకునితో కలసి శేఖర్ ను ఓ పథకం ప్రకారం జైలుకు పంపించి ఉంటాడు. జైలులో పరిచయమైన వారి ద్వారా జైలు నుండి తప్పించుకొంటాడు శేఖర్. రేఖను కలిశాక అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తరువాత తన దొంగ మిత్రులతో, రేఖతోనూ కలసి ఓ ఊరు చేరుకుంటారు. ఓ జమీందార్ ఆ ఊరిని బాగు చేయించమని పంపినవారిగా గ్రామస్థులు భావించి, వీరిని గౌరవిస్తారు. వారు కూడా అదే చోటు మంచిదని అక్కడే ఉంటారు. ఆ ఊరిని పీడిస్తున్న దొంగలముఠాకు బుద్ధి చెబుతారు. ఆ ముఠాతో చేతులు కలిపి, రాజకీయనాయకుడు శేఖర్ ను అతని మిత్రులను అంతమొందించాలనుకుంటాడు. చివరకు శేఖర్, అతని మిత్రులు, గ్రామస్థులు ఎదురు తిరిగి విజయం సాధిస్తారు. రాజకీయనాయకుణ్ణి, దొంగలను అరెస్ట్ చేస్తారు. జైలు నుండి తప్పించుకు వచ్చినందుకు తమనూ అరెస్ట్ చేయమని శేఖర్ కోరతాడు. తిరిగి వస్తామని చెప్పి, వారు వెళ్తూండగా కథ ముగుస్తుంది.
ఈ చిత్రంలో మోహన్ బాబు, నాగభూషణం, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, త్యాగరాజు, కేవీ చలం, మాడా, జయమాలిని ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణమూర్తి మాటలు రాయగా, పాటలను కొసరాజు, ఆరుద్ర, దాశరథి, గోపి పలికించారు. సత్యం సంగీతం సమకూర్చారు. ఇందులో మోహన్ బాబు ఊతపదం ‘చిక్కర్ మే రక్కా’ అన్నది అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. “అందమైనా చిన్నవాడా…”, “వచ్చాడు చూడు వరసైన వాడు…”, “పండంటి చిన్నదిరా…”, “చూశానే ఓలమ్మీ చూశానే…”, “కండలు పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా…” అంటూ సాగే పాటలు అలరించాయి. కృష్ణ రీమేక్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ సినిమాగా ‘భలే దొంగలు’ నిలచింది.