Casting Couch: ‘బట్టలు విప్పమన్నారు’.. కాస్టింగ్ కౌచ్‌పై నటి శ్వేతా క్వాత్రా షాకింగ్ వ్యాఖ్యలు

Casting Couch (2)

Casting Couch (2)

Casting Couch: వెండితెర, బుల్లితెర గ్లామర్ వెనుక ఎన్నో చేదు అనుభవాలు ఉంటాయని పలువురు నటీనటులు గతంలో వెల్లడించారు. ఇప్పుడు ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా క్వాత్రా కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని బహిరంగంగా పంచుకోవడంతో మరోసారి కాస్టింగ్ కౌచ్ అంశం చర్చనీయాంశమైంది. ‘కహానీ ఘర్ ఘర్ కీ’, ‘కుంకుమ్’ వంటి సీరియళ్లతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె, పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదురైన పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేశాయని వెల్లడించారు. ప్రస్తుతం దుబాయ్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తున్న శ్వేతా క్వాత్రా, నటుడు షైనీ నారంగ్‌తో జరిగిన సంభాషణలో తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తు చేసుకున్నారు. గణితంలో ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత అనుకోకుండా టెలివిజన్ రంగంలోకి వచ్చిన తాను, ఆ సమయంలో పరిశ్రమలో ఉండే కొన్ని సూచనలు కూడా అర్థం చేసుకోలేకపోయేదానినని చెప్పారు. ముఖ్యంగా కాస్టింగ్ ఏజెంట్లు, మధ్యవర్తులు కొత్తగా వచ్చే అమ్మాయిల అమాయకత్వాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసేవారని ఆమె ఆరోపించారు.

తనను కూడా పలుమార్లు అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని శ్వేత తెలిపారు. కొందరు నేరుగా ‘మీరు రాజీ పడతారా?’ అని ప్రశ్నించేవారని, ఆ మాటల వెనుక అసలు ఉద్దేశం మొదట్లో తనకు అర్థం కాలేదని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే హావభావాలు, మాట్లాడే తీరు చూసి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమయ్యేదని ఆమె చెప్పుకొచ్చారు. ఒకసారి తనను ఓ ప్రముఖ హోటల్‌లో ఆడిషన్ ఉందని పిలిచారని శ్వేత వెల్లడించారు. బయట చాలామంది కంటెస్టెంట్స్ ఉండటంతో మొదట భయం అనిపించలేదని, కానీ తర్వాత రచయితలు, దర్శకుడు, నిర్మాత ఉన్న గదిలోకి తనను ఒక్కరినే పిలిచారని చెప్పారు. స్క్రిప్ట్ చదివారా అని అడిగిన తర్వాత, చుట్టూ తిరిగి చూపించమని చెప్పారని, తాను అలాగే చేసిన వెంటనే “ఇప్పుడు బట్టలు విప్పండి” అని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు.

మొదట తాను సరిగ్గా వినలేదనుకున్నానని, కానీ మళ్లీ అదే మాట చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని శ్వేత తెలిపారు. ఆ సమయంలో తనకు సిగ్గు, కోపం, భయం అన్నీ ఒకేసారి కలిగాయని చెప్పారు. ఎందుకు? అని ప్రశ్నించగా, స్విమ్ టెస్ట్ కోసం అని చెబుతూ, మీరు స్విమ్‌సూట్‌లో ఎలా కనిపిస్తారో చూడాలని సమాధానం ఇచ్చారని వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి తాను ప్రశాంతంగా వ్యవహరించి, మర్యాదగా అక్కడి నుంచి వెళ్లిపోయానని శ్వేత చెప్పారు. ఆ సంఘటన తర్వాత ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లేటప్పుడు ముందుగా బయటకు వచ్చే మార్గం ఏదో చూసుకునే అలవాటు ఏర్పడిందని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో భయపడకుండా, ముందుగా తమ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని యువతులకు ఆమె పరోక్షంగా సూచించారు.

శ్వేతా క్వాత్రా ప్రస్తుతం నటుడు మానవ్ గోహిల్‌తో వైవాహిక జీవితం గడుపుతున్నారు. ఆమె చివరిసారిగా ‘బాల్వీర్’ సీరియల్‌లో కనిపించారు. ప్రస్తుతం దుబాయ్‌లో స్థిరపడిన ఆమె, సోషల్ మీడియా ద్వారా లైఫ్ స్టైల్, పర్సనాల్టీ డెవలప్మెంట్ , దుబాయ్‌లో జీవితం వంటి అంశాలపై వీడియోలు, సలహాలను పంచుకుంటూ అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇన్నేళ్ల తర్వాత బయటపెట్టడం మరోసారి కాస్టింగ్ కౌచ్ సమస్యపై చర్చను వేడెక్కించింది.