Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..

Amitabh Bachchan (2)

Amitabh Bachchan (2)

Sholay: కొన్ని సినిమాలు కాలంతో కలిసి కనుమరుగవుతాయి. మరికొన్ని తరాలు మారినా వాటి ప్రభావాన్ని కోల్పోవు. అలాంటి అరుదైన చిత్రాల్లో అమితాబ్ బచ్చన్ నటించిన ‘షోలే’ ఒకటి. విడుదలై 51 ఏళ్లు గడిచినా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తూనే ఉంది. తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతి 18 వేదికపై అమితాబ్ బచ్చన్ చెప్పిన ఓ సంఘటన ఈ క్లాసిక్ మూవీకి విదేశాల్లో కూడా ఎంతటి ఆదరణ ఉందో మరోసారి గుర్తు చేసింది. ఇటలీలో 2,000 మంది ప్రేక్షకులు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు షోలేను వీక్షించిన ఘటన ఇప్పుడు సినీ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

ఇటలీలోని బోలోగ్నా నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడం Piazza Maggiore లో 2025 జూన్ 27న ప్రతిష్టాత్మక ‘ఇల్ సినిమా రిట్రోవాటో’ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా 2,000 మంది విదేశీ ప్రేక్షకులు ‘షోలే’ సినిమాను చూశారు. 1975 నాటి ఈ భారతీయ క్లాసిక్ చిత్రం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ వారు పునరుద్ధరించిన (4K Restored) సరికొత్త డైరెక్టర్స్ కట్ వెర్షన్‌ను అక్కడ ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన విశేషాలను అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC)’ షోలో ఎంతో గర్వంగా గుర్తుచేసుకున్నారు. భాష తెలియకపోయినప్పటికీ, ఆ ఇటాలియన్ ప్రేక్షకులంతా రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు కదలకుండా కూర్చుని సినిమాను ఎంతో ఆసక్తిగా తిలకించడం విశేషం. ఈ అన్‌కట్ వెర్షన్‌లో అప్పట్లో సెన్సార్ బోర్డు తొలగించిన 6 నిమిషాల ఫుటేజ్‌తో పాటు, ఠాకూర్ చేతిలో గబ్బర్ సింగ్ అంతమొందే ఒరిజినల్ క్లైమాక్స్ సీన్‌ను కూడా ప్రదర్శించారు. ఆ ప్రదర్శనకు వచ్చిన స్పందనే తనను విస్మయానికి గురిచేసిందని అమితాబ్ చెప్పారు.

షోలే విడుదలై 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జ్ఞాపకాన్ని అమితాబ్ పంచుకోవడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 1975 ఆగస్టు 15న రమేష్ సిప్పీ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదల సమయంలోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ సినిమా, తర్వాత కల్ట్ క్లాసిక్‌గా మారి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ జై పాత్రలో నటించగా, ధర్మేంద్ర వీరూ పాత్రతో అలరించారు. హేమా మాలిని, జయా బచ్చన్, అమ్జద్ ఖాన్, సంజీవ్ కుమార్ వంటి దిగ్గజ నటుల నటన కూడా చిత్రాన్ని చిరస్థాయిగా నిలబెట్టింది. ముఖ్యంగా గబ్బర్ సింగ్ పాత్ర, జై వీరూ స్నేహం, సంభాషణలు, పాటలు ఇప్పటికీ భారతీయ పాప్ కల్చర్‌లో భాగంగానే కొనసాగుతున్నాయి. షోలే పునరుద్ధరణలో ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ చేసిన కృషి కూడా ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది. భారతీయ సినీ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు భద్రపరిచే లక్ష్యంతో ఈ సంస్థ పలు క్లాసిక్ చిత్రాలను లేటెస్ట్ టెక్నాలజీ పునరుద్ధరిస్తోంది. షోలే ఇటలీలో సాధించిన రెస్పాన్స్ ను చూస్తే, ఇండియన్ క్లాసిక్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతటి ఆదరణ ఉందో మరోసారి నిరూపించింది.