Site icon NTV Telugu

Mannava Balayya : బహుముఖ ప్రజ్ఞాశాలి మన్నవ బాలయ్య!

Mannava Balayya

Mannava Balayya

బాలయ్య అంటే ఈ రోజుల్లో నందమూరి బాలకృష్ణ అనుకుంటారు. కానీ మన్నవ బాలయ్య అనే సీనియర్ నటులు ఉన్నారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత ఇలా తన బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు సేవలందించారు యమ్.బాలయ్య. అందరివాడుగా, అందరికీ తలలో నాలుకలా ఉంటూ అతి సౌమ్యునిగా పేరొందారు యమ్.బాలయ్య. ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నిటికి దర్శకత్వమూ వహించారు. వందలాది చిత్రాలలో కేరెక్టర్ యాక్టర్ గా నటించి మెప్పించారు.

మొదట్లో కథానాయకుడే!
మన్నవ బాలయ్య 1930 ఏప్రిల్ 9న గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో జన్మించారు. ఆయన తండ్రి మన్నవ గురవయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. బాలయ్య కన్నవారు ఇద్దరూ సాహిత్యాభిలాషులు. చదువంటే ప్రాణం. అందువల్ల తమ అబ్బాయిని బాగా చదివించాలని తపించారు. అదే రీతిన బాలయ్య కూడా ఆ రోజుల్లోనే బి.ఇ., చదివారు. 1952లో బి.ఇ., పట్టా పుచ్చుకోగానే కాకినాడ, మద్రాసు పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేశారు. అప్పట్లోనే ఆయన నాటకాలు వేసేవారు. బాలయ్యను చూసిన కొందరు హిందీ నటుడు అశోక్ కుమార్ లాగా ఉన్నావు అనేవారు. దాంతో ఆయనకు కూడా సినిమా రంగంపై ఆసక్తి కలిగింది. మిత్రుల ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అప్పటికే ‘రోజులు మారాయి’ చిత్రంతో దర్శకునిగా తనదైన బాణీ పలికించిన తాపీ చాణక్యను కలిశారు. ఆయన కూడా బాలయ్యను ప్రోత్సహిస్తూ తాను తెరకెక్కించిన ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో హీరోని చేశారు. సారథీ స్టూడియోస్ నిర్మించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వరుసగా చాణక్య దర్శకత్వంలో సారథీ స్టూడియోస్ నిర్మించిన ‘భాగ్యదేవత, కుంకుమ రేఖ’ సినిమాల్లోనూ బాలయ్య నాయక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో బాలయ్యకు ఓ గుర్తింపు లభించింది. కమల్ ఘోష్ అనే బెంగాలీ నిర్మించిన ‘మనోరమ’ చిత్రంలో బాలయ్య హీరోగా నటించారు. అప్పటికే బెంగాల్ సినిమా రంగంతో అనుబంధం ఉన్న ప్రముఖ సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఇందులో ప్రఖ్యాత హిందీ నేపథ్యగాయకుడు తలత్ మహమ్మద్ తో తెలుగు పాటలు పాడించారు. “అందాలసీమా సుధా నిలయం…” అనే తలత్ మహమ్మద్ పాడిన పాట ఆ రోజుల్లో సంగీత ప్రియులను అలరించింది.

విలక్షణమైన పాత్రల్లో…
మహానటి సావిత్రి తన నటజీవితంలో మరపురాని చిత్రంగా పేర్కొన్న ‘చివరకు మిగిలేది’లో కీలక పాత్ర పోషించి అలరించారు బాలయ్య. ఆ పై ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించిన ‘కృష్ణప్రేమ’ పౌరాణికంలో తొలిసారి కృష్ణునిగా నటించారాయన. కె.ఎస్.ప్రకాశరావు తెరకెక్కించిన ‘మోహినీ రుక్మాంగధ’లో రుక్మాంగధునిగా అభినయించారు. వరుసగా కథానాయక పాత్రల్లోనే నటించినా, ఎందుకనో బాలయ్య ఆశించిన విజయం దరి చేరలేదు. దాంతో ఇతర హీరోల చిత్రాలలో కీలక పాత్రలు పోషించసాగారు. యన్టీఆర్ తో “ఇరుగు -పొరుగు, బభ్రువాహన, బొబ్బిలియుద్ధం, పాండవవనవాసము, వివాహబంధం, శ్రీక్రిష్ణపాండవీయం” వంటి చిత్రాలలో నటించారు. ‘పాండవవనవాసము’లో యన్టీఆర్ భీమునిగానూ, బాలయ్య అర్జునునిగానూ అభినయించారు. దాంతో యన్టీఆర్ తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో ధర్మరాజు పాత్రలో బాలయ్యను నటింప చేశారు. ఇక యన్టీఆర్ తో యస్.డి.లాల్ నిర్మించి, తెరకెక్కించిన ‘నేనే మొనగాణ్ణి’లో బాలయ్య విలన్ గా నటించడం విశేషం! ఆ తరువాత నుంచీ బాలయ్యను కేరెక్టర్ రోల్స్ పలకరించాయి.

నిర్మాతగా…
బాలయ్య ఓ వైపు నటిస్తూనే మరోవైపు తన వద్దకు వచ్చిన అనేక మంది విద్యార్థులకు ఇంగ్లిష్ , మ్యాథ్స్ బోధించేవారు. ఆయన కథలు కూడా రాసేవారు. బాలయ్య రాసిన కథలు కొన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. దాంతో తన కథలపై తనకే నమ్మకం కుదిరింది. మిత్రుల సహకారంతో ‘అమృతా ఫిలిమ్స్’ సంస్థను నెలకొల్పారు. దర్శకుడు కె.విశ్వనాథ్ తో తన కథల గురించి చర్చించేవారు. వాటిలోని వైవిధ్యం విశ్వనాథ్ కూ బాగా నచ్చింది. ‘తుఫాన్’ అనే పత్రికలో బాలయ్య రాసిన ‘నలుపు-తెలుపు’ అనే కథ ముద్రితమైంది. ఆ కథ ఆధారంగానే గొల్లపూడి మారుతీరావుతో కలసి ‘చెల్లెలి కాపురం’ కథ తయారు చేశారు బాలయ్య. అలా బాలయ్య తన సమర్పణలో విశ్వనాథ్ దర్శకునిగా ‘చెల్లెలి కాపురం’ నిర్మించారు. శోభన్ బాబుకు నటునిగా ఈ సినిమా ఎనలేని పేరు సంపాదించి పెట్టింది. ఉత్తమ చితంగా బంగారు నందిని అందుకుందీ సినిమా. ఆ తరువాత కృష్ణ హీరోగా విశ్వనాథ్ దర్శకత్వంలో ‘నేరము-శిక్ష’ తీశారు. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది.

ఎమ్జీఆర్ మెప్పు!
రష్యన్ రచయిత ఫైడర్ డోస్టోవస్కీ రాసిన ‘క్రైమ్ అండ్ పనిష్ మెంట్’ కథ ఆధారంగా ‘నేరము-శిక్ష’ కథ తయారు చేశారు బాలయ్య. ఈ సినిమాలో నటునిగా బాలయ్యకు మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రాన్ని చూసిన నాటి మేటి తమిళ సూపర్ స్టార్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.జి.రామచంద్రన్ ఎంతగానో అభినందించి, ఆ సినిమాను రీమేక్ చేయడానికి హక్కులు తీసుకున్నారు. ‘నీదిక్కు తలైవనంగు’ పేరుతో ఎమ్జీఆర్ తమిళంలో రీమేక్ చేశారు. తెలుగులో బాలయ్య పాత్రను తమిళంలోనూ ఆయనతోనే పోషింపచేశారు ఎమ్జీఆర్.

యన్టీఆర్ స్ఫూర్తి!
బాలయ్య హిందీలో పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్ ను, తెలుగులో యన్టీఆర్ ను అభిమానించేవారు. యన్టీఆర్ తో కలసి పనిచేయడం వల్ల ఆయన క్రమశిక్షణకు ఆకర్షితులయ్యారు. ఇక యన్టీఆర్ ‘శ్రీక్రిష్ణపాండవీయం’లో నటించే సమయంలోనే నిర్మాతగా రామారావు బడ్జెట్ ను ఎంతలా కంట్రోల్ చేస్తారో ప్రత్యక్షంగా చూశారు. అదే రీతిన తాను నిర్మించే చిత్రాల విషయంలోనూ బడ్జెట్ ను కంట్రోల్ చేసుకొనేవారు బాలయ్య. నిజానికి ‘చెల్లెలి కాపురం’ విజయం తరువాత శోభన్ బాబుతోనే ‘నేరము-శిక్ష’ నిర్మించాలని ఆశించారు బాలయ్య. కథ విన్న శోభన్, ఆ సినిమాను కలర్ లో తీస్తేనే నటిస్తానని భీష్మించుకున్నారు. దాంతో కృష్ణ దగ్గరకు ‘నేరము-శిక్ష’ కథ వెళ్ళింది. బాలయ్య తన చిత్రాలలో సంగీత సాహిత్యాలకూ పెద్ద పీట వేసేవారు. తొలి చిత్రంలోనే “చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన…” వంటి పాటను సినారెతో రాయించుకొని మురిపించారు. ఈ పాటతోనే గాయకునిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఎనలేని కీర్తి లభించింది. తరువాత ‘మల్లీశ్వరి’ స్వరకర్త సాలూరు రాజేశ్వరరావును ‘నేరము-శిక్ష’కు సంగీత దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ పై వరుసగా తాను నిర్మించిన “అన్నదమ్ముల కథ, ఈ నాటి బంధం ఏ నాటిదో, ప్రేమ-పగ” వంటి చిత్రాలకు కూడా రాజేశ్వరరావు స్వరకల్పన చేశారు.

కృష్ణతో బంధం!
‘నేరము-శిక్ష’ తరువాత బాలయ్యకు, హీరో కృష్ణకు మంచి అనుబంధం ఏర్పడింది. బాలయ్య ‘అన్నదమ్మల కథ’ తీసే రోజుల్లోనే కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ తెరకెక్కిస్తున్నారు. అందులో అగ్గిరాజు పాత్రకు తొలుత యస్వీ రంగారావును అనుకున్నారు. కానీ, ఆయన అనారోగ్య కారణాల వల్ల ఆ పాత్రలో నటించడానికి వీలు పడలేదు. ఆ సమయంలో కృష్ణకు చప్పున బాలయ్య గుర్తుకు వచ్చారు. ఆయనను పిలిపించి, టెస్ట్ చేసి, ఆ స్టిల్స్ విజయా అధినేత చక్రపాణికి చూపించారు. ఆయన కూడా ఓకే అనడంతో అగ్గిరాజు పాత్రలో బాలయ్య నటించి మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత కృష్ణతో “ఈ నాటి బంధం ఏ నాటిదో, చుట్టాలున్నారు జాగ్రత్త” వంటి చిత్రాలు నిర్మించారు బాలయ్య. చిరంజీవితో ‘ఊరికిచ్చిన మాట’ నిర్మించడమే కాదు, ఆ చిత్రానికి దర్శకత్వమూ వహించారు. ఆ పై కృష్ణంరాజుతో ‘నిజం చెబితే నేరమా’ తీశారు. ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ నుంచి ఎమ్.ఎస్. విశ్వనాథన్ తో వరుసగా స్వరకల్పన చేయించారు బాలయ్య. తరువాత తన తనయుడు తులసీరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘పసుపుతాడు’ అనే సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు బాలయ్య. రాధ నాయికగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దాంతో చిత్ర నిర్మాణానికి దూరంగా జరిగారు బాలయ్య. ఆ తరువాత నటనకే పరిమితమయ్యారు.

వైవిధ్యమైన పాత్రల్లో…
నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనే బాలయ్య నటునిగానూ మెప్పించారు. ‘నామాల తాతయ్య’లో శ్రీనివాసుని పాత్రలో నటించారు. ఇక ‘భక్త కన్నప్ప, జగన్మాత’ వంటి పురాణగాథల్లో శివునిగా మెప్పించారు. అనేక జానపద, చారిత్రక, పౌరాణికాల్లో ప్రముఖ పాత్రలే ధరించారు. అయినప్పటికీ బాలయ్య పేరు వినగానే ఆయన పోషించిన కేరెక్టర్ రోల్స్ ముందుగా గుర్తుకు వస్తాయి. యన్టీఆర్ తో కడదాకా బాలయ్యకు మంచి అనుబంధం ఉండేది. యన్టీఆర్ చివరి చిత్రంగా తెరకెక్కిన ‘మేజర్ చంద్రకాంత్’లోనూ ఆయన మిత్రునిగా నటించారు బాలయ్య. ఇక యన్టీఆర్ నటవారసుడు బాలకృష్ణతోనూ బాలయ్య కొన్ని చిత్రాలలో అభినయించారు. బాలకృష్ణను చిత్రసీమలో అందరూ ‘బాలయ్యా’ అంటూ సంబోధిస్తుంటారు. దాంతో ఈ తరం ప్రేక్షకులకు ‘బాలయ్యా’ అనగానే బాలకృష్ణనే గుర్తుకు వస్తారు. ‘వంశానికొక్కడు’లో బాలయ్యకు తండ్రిలాంటి పాత్రలో నటించారు మన్నవ బాలయ్య. బాలకృష్ణ నటించిన బాపు ‘శ్రీరామరాజ్యం’లో వశిష్టుని పాత్రలో కనిపించారు బాలయ్య. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉన్న బాలయ్య ఈ రోజు ఉదయం హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.

Exit mobile version