సీనియర్ హీరో మోహన్ బాబు ట్రోలింగ్ పై మండిపడ్డారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 18న ఈ సినిమా విడుదల కానుంది.
Read Also : Meera Jasmine : మాస్ డైరెక్టర్ ఆఫర్… అందుకేనా ఈ అందాల ఆరబోత
ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు మాట్లాడుతూ “ఇటీవల కాలంలో సెలెబ్రిటీలపై వస్తున్న ట్రోలింగ్, మీమ్స్ చూసి చాలా బాధ పడుతున్నాను… నిజానికి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆత్మాభిమానం అనేది ఉంటుంది కదా… ఎదుటి వ్యక్తిని ట్రోలింగ్ చేయవచ్చేమో తెలియదు కానీ… అందులో వ్యంగ్య ధోరణి ఇబ్బందికరంగా ఉంటుంది. నేను సాధారణంగా వాటిని పట్టించుకోను. కానీ ఎవరన్నా పంపిస్తే చూస్తాను. కొంతమంది అదే పని మీద ఉంటారు. ఇద్దరు హీరోలు కొంతమందిని అపాయింట్ చేసుకుని ఇలా ట్రోలింగ్ చేయిస్తున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి… చెప్పిన వాడిని, చేసిన వాడిని ప్రకృతి చూస్తోంది. వాళ్ళు ఇప్పటికి బాగానే ఉండొచ్చు… కానీ ఎదో ఒకరోజు వాళ్లకు శిక్ష తప్పదు… మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలి… అంతేకాని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు” అంటూ ట్రోలింగ్ పై మండిపడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే మోహన్ బాబు చెప్పిన ఆ ఇద్దరు హీరోలు ఎవరా అంటూ ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇక రానున్న రోజుల్లో నాలుగు సినిమాలు చేయబోతున్నాను అంటూ తన నెక్స్ట్ సినిమాల గురించి చెప్పుకొచ్చారు మోహన్ బాబు. విష్ణుతో ఒక సినిమా, మనోజ్ తో ఒక సినిమా, తాను కీలక పాత్రలో మరో సినిమా చేయబోతున్నట్టు వెల్లడించారు మోహన్ బాబు.
