Site icon NTV Telugu

Tollywood: బాక్సాఫీస్ సునామీ: 10 రోజులు – 5 సినిమాలు – 800 కోట్లు!

Sankranthi Tollywood

Sankranthi Tollywood

జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయింది, ఎందుకంటే కేవలం పది రోజుల వ్యవధిలో (జనవరి 9 నుండి జనవరి 19 వరకు), ఐదు భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ, దాదాపు రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించడం టాలీవుడ్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. సంక్రాంతి అంటేనే తెలుగు సినీ ప్రియులకు ఒక రకమైన పూనకం, కానీ 2026 సంక్రాంతి మాత్రం ఊహించని రేంజ్ వసూళ్లతో ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. పాత రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఆ ఐదు సినిమాలు రచ్చ రేపాయి.

1. మన శంకరవరప్రసాద్ గారు: మెగాస్టార్ వింటేజ్ మాస్ రచ్చ!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన “మన శంకరవరప్రసాద్ గారు” ఈ సీజన్‌కు అసలైన ‘సంక్రాంతి విన్నర్’గా నిలిచింది, మెగాస్టార్‌లోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను, మాస్ ఎనర్జీని అనిల్ రావిపూడి అద్భుతంగా వాడుకున్నారు. కేవలం వారం రోజుల్లోనే ఈ చిత్రం రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి, సంక్రాంతి రేసులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది, ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టడంతో థియేటర్లన్నీ కళకళలాడాయి.

2. రాజాసాబ్: రెబల్ స్టార్ హారర్ కామెడీ మేజిక్
డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్‌లో వచ్చిన “రాజాసాబ్” జనవరి 9న గ్రాండ్‌గా విడుదలైంది, ప్రభాస్ లుక్స్, హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ప్రభాస్ క్రేజ్ దృష్ట్యా భారీ ఓపెనింగ్స్ సాధించి పది రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 238 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తన మార్క్ చూపించింది.

Also Read :Jananayagan: ‘జననాయగన్’ సెన్సార్ కేసు తీర్పు రిజర్వ్

3. భర్త మహాశయులకు విజ్ఞప్తి: మాస్ రాజా హిలేరియస్ ఎంటర్టైనర్
మాస్ మహారాజా రవితేజ తనదైన శైలిలో “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమాతో పండగ రేసులోకి వచ్చారు, కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, కుటుంబ సంబంధాలు మరియు భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ డ్రామాతో ఆకట్టుకుంది. రవితేజ ఎనర్జీ, సత్య మరియు సునీల్ కామెడీ ట్రాక్స్ సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకెళ్లాయి. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వడం లేదు.

4. నారీ నారీ నడుమ మురారి: శర్వానంద్ క్లాసిక్ విన్నర్
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటించిన “నారీ నారీ నడుమ మురారి” సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది, ముగ్గురు భామల మధ్య నలిగిపోయే యువకుడిగా శర్వానంద్ నటన మరియు సినిమాలోని స్వచ్ఛమైన హాస్యం ప్రేక్షకులకు మంచి ఉపశమనాన్ని ఇచ్చాయి. పండగ చివరి రోజుల్లో ఈ సినిమా వసూళ్లు అనూహ్యంగా పెరగడం విశేషం. తక్కువ రేట్లకే అమ్మడంతో అన్ని ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి కానీ నిర్మాతలు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఇవ్వడం లేదు.

Also Read :Naveen Polishetty: అవకాశాలకోసం కృష్ణ నగర్ లో చెప్పులు అరిగేలా తిరిగా..!

5. అనగనగా ఒక రాజు: నవీన్ పోలిశెట్టి కామెడీ ధమాకా
యువ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ టైమింగ్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. “అనగనగా ఒక రాజు” చిత్రంలో నవీన్ నటన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం కేవలం 4 రోజుల్లోనే మిలియన్ డాలర్ల మార్కును దాటి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది అలాగే ఓవరాల్ గా 102 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఈ ఐదు చిత్రాలు కలిపి జనవరి 9 నుంచి 19 వరకు కేవలం పది రోజుల్లోనే రూ. 800 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాయి. ఇది తెలుగు సినిమా మార్కెట్ పెరిగిన తీరుకు నిదర్శనం, పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా, కథాబలం ఉన్న చిన్న సినిమాలు కూడా ఈ పండగ సీజన్‌లో విజయం సాధించడం గమనార్హం. మొత్తానికి 2026 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయమైన సీజన్ గా మిగిలిపోయింది.

Exit mobile version