Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Heartin

Heartin

Heartin OTT Release: సరికొత్త కంటెంట్ తో ఆడియన్స్ అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. ఇక భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా వీటిని ఆదరిస్తూనే ఉన్నారు. వీటిలో కూడా హారర్, థ్రిల్లర్, రొమాంటిక్ జానర్ లను క్రేజీగా చూస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు ఓ కొత్త కంటెంట్ ను తీసుకొస్తున్నారు మేకర్స్. రొమాంటిక్ జానర్ లో వస్తున్న ఈ తమిళ సినిమాను తెలుగులోనూ ఎంచక్కా చూసేయచ్చు. రెండు నెలలు కూడా తిరక్కుండా ఓటీటీలోకి వస్తున్న ఈ ట్రయాంగిల్ ప్రేమ కథను ఎక్కడ చూడచ్చు ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

సనంత్, మడోన్నా సెబాస్టియన్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ తమిళ కామెడీ ‘హార్టిన్’(Heartin) థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. కిషోర్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 26న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కానుంది. ఇది తమిళ చిత్రం అయినప్పటికీ, ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ డబ్బింగ్ భాషలలో కూడా అందుబాటులోకి రాబోతోంది. ఒక ప్రేమ జంట జీవితంలోకి మాజీ ప్రియురాలు తిరిగి రావడం వల్ల జరిగే గందరగోళం చుట్టూ దర్శకుడు కిషోర్ కుమార్ ఈ కథను సరదాగా తెరకెక్కించారు.

కథ

జైపూర్‌లో ‘తమిళ్ భవన్’ అనే సౌత్ రెస్టారెంట్‌ను నడిపే హెడ్ చెఫ్ శివగా సనంత్ ఇందులో కనిపిస్తారు. కాలేజీ రోజుల్లో సాహిత్యతో జరిగిన లవ్ ఫైల్యూర్ కావడంతో అతను ఇప్పటికీ ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడడు. అయితే పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో చెన్నై నుంచి జైపూర్‌కు వచ్చిన ఐటీ ప్రొఫెషనల్ సాధన అతని జీవితంలోకి రావడంతో పరిస్థితులు మారిపోతాయి.

సాధనతో పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. శివ తన మనసులోని భావాలను ఆమెతో పంచుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించే సమయంలో అనుకోని రోడ్డు ప్రమాదం వారి బంధాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రమాదంలో శివ తీవ్రంగా జ్ఞాపకశక్తిని కోల్పోతాడు. కళ్లు తెరిచిన తర్వాత జైపూర్ జీవితం, సాధనతో ఉన్న బంధం అతనికి గుర్తుండదు. బదులుగా అతని జ్ఞాపకాలు కాలేజీ రోజుల వద్ద ఆగిపోతాయి.

దీంతో తాను ఇప్పటికీ సాహిత్యనే ప్రేమిస్తున్నానని శివ నమ్ముతాడు. ఇదే సమయంలో సాహిత్య మళ్లీ అతని జీవితంలోకి రావడంతో గతం, వర్తమానం మధ్య అతని పోరాటం మొదలవుతుంది. శివను తిరిగి తన ప్రేమలో పడేయడానికి సాధన చేసే ప్రయత్నాలు కథలో కీలకంగా మారతాయి. పాత ప్రేమ నిజంగా నిలుస్తుందా, లేక సాధనతో ఏర్పడిన బంధమే అతని కోల్పోయిన జ్ఞాపకాలను తిరిగి తీసుకొస్తుందా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఈ చిత్రంలో సనంత్, మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషించగా, ఎమయా టి, వాట్సాప్ మణి, దేబ్నీత కర్, ప్రగతి, ఉమా పద్మనాభన్, అజిత్ కుష్వాహా, మాథ్యూ వర్గీస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కిషోర్ కుమార్ కథను రాసి దర్శకత్వం వహించారు. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ మురుగేశన్ సంగీతం అందించారు. థియేటర్లలో ‘హార్టిన్’ను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ ప్రేమకథను చూసేయచ్చు.