Samantha Talks About Divorce With Naga Chaitanya and Alimony Rumours: నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకొని చాలాకాలమే అవుతున్నా.. ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో అది హాట్ టాపిక్‌గానే ఉంది. ఇందుకు కారణం.. వారి విడాకుల వెనుక గల అసలు రీజన్స్‌పై ఇంకా స్పష్టత రాకపోవడమే! అయితే.. చాలామంది సమంతదే తప్పు అని విడాకుల సమయంలో ఆమెను నిందించారు. సోషల్ మీడియాలో తారాస్థాయిలో ట్రోల్ చేశారు. భరణం కూడా తీసుకుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వీటిపై సమంత ఎన్నడూ స్పందించలేదు. అటు చైతూ సైతం ఈ వ్యవహారంపై మాట్లాడలేనని మాట దాటవేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు కాఫీ విత్ కరణ్ షోలో భాగంగా సమంత వాటిపై స్పందించింది.
తమ మధ్య సఖ్యత లేకపోవడం వల్లే విడిపోయామని, అయితే తమ విడాకులు అంత సులభంగా జరగలేదని సమంత పేర్కొంది. విడిపోయిన సమయంలో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని, ప్రస్తుతం ఆ బాధ నుంచి బయటపడ్డానని, మునుపటి కన్నా మరింత దృఢంగా తయారయ్యానని తెలిపింది. తమ మధ్య మంచి అనుబంధం లేదని చెప్పిన సమంత.. ఒకవేళ తామిద్దరినీ ఒకే గదిలో ఉంచితే, అక్కడ కత్తిలాంటి పదునైన ఆయుధాలు లేకుండా చూసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేసింది. భవిష్యత్తులో తమ మధ్య సఖ్యత వస్తుందో లేదో తెలీదని చెప్పింది. తామిద్దరం విడిపోయినప్పుడు తనపై నెగెటివ్ ప్రచారం ఎక్కువగా జరిగిందని, అప్పుడు వాటిపై స్పందించేందుకు తన వద్ద సమాధానాలు లేవని తెలిపింది. తాను ఓపెన్‌గా ఉండాలనుకున్నానని, అందుకే విడిపోయిన విషయాన్ని అందరికి చెప్పానని చెప్పుకొచ్చింది. ఓ సందర్భంలో ‘నీ భర్త నుంచి విడిపోయినప్పుడు..’ అని కరణ్ అడగ్గా.. ‘భర్త కాదు మాజీ భర్త’ అంటూ సమంత ఘాటుగా సమాధానిచ్చింది.
ఇదే సమయంలో తాను ‘ఊ అంటావా’ పాట చేయడానికి గల కారణాల్ని రివీల్ చేసింది. చైతూ విడిపోయిన కొన్ని రోజులకే తనకు ఆ పాట ఆఫర్ వచ్చిందని, తనకెంతో నచ్చడంతో అందులో యాక్ట్ చేశానని వివరించింది. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాల్ని ఎత్తిచూపేందుకు ఈ పాట సరైందని తనకు అనిపించిందని, తనలాంటి స్టార్ సెలెబ్రిటీ చెప్తే కచ్ఛితంగా అందరికీ చేరువవుతుందని తాను భావించానని సమంత వెల్లడించింది. ఇక రూ. 250 కోట్ల భరణం తీసుకున్నట్టు వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. ‘‘సోషల్ మీడియాలో నాపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా.. విడాకుల తర్వాత భరణం కింద రూ. 250 కోట్లు తీసుకున్నానని వచ్చిన వార్తలు చూసి షాకయ్యా. ఆ వార్తలు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటిపై దాడులు చేసి, అవన్నీ అవాస్తవాలని చెప్తే బాగుండని ప్రతిరోజూ ఎదురుచూసేదాన్ని’’ అని సమంత కామెడీగా స్పందించింది.
