NTV Telugu Site icon

Sabari: ‘శబరి’ టైటిల్‌ అందుకే పెట్టాం.. వరలక్ష్మీని ఎంచుకున్నాం: దర్శకుడు అనిల్‌ ఇంటర్వ్యూ

Director Anil Katz

Director Anil Katz

Sabari Director Anil Katz Interview: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కాట్జ్ మీడియాతో ముచ్చటించారు.

‘శబరి’ ఆలోచన ఎప్పుడు వచ్చింది?
నాలుగైదేళ్ల క్రితం, ‘ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది’ – ఇది నేను చెబుదామనుకున్నా పాయింట్! మారుతున్న సమాజంలో ప్రేమకు స్వచ్ఛమైన రూపం మాతృత్వంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. తల్లి ప్రేమలో నిజాయితీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బాగుంటుంది అని కథ రాసుకున్నా.

‘శబరి’ టైటిల్ ఎందుకు?
రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కొడుకు కాదు. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసి, రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని, ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని ఎంగిలి చేసి ఇస్తుంది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది, కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే ‘ఆడ పులి’ అని అర్థం, నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి, అందుకే, ఆ టైటిల్ పెట్టా.

వరలక్ష్మీని ఎంపిక చేసుకోడానికి కారణం? వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు ఇండియాలో తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరి ‘శబరి’ చేయగల, సినిమా లీడ్ రోల్‌లో వేరియేషన్స్ అన్నిటినీ పండించగల ఆర్టిస్ట్ ఎవరున్నారని చూస్తే వరలక్ష్మీ కనిపించారు. ‘పందెం కోడి 2’, ‘తార తప్పటై’, ‘విక్రమ్ వేద’, ‘సర్కార్’లో మంచి పెర్ఫార్మన్స్ చేశారు. ఆవిడ హీరోయిన్ గా సినిమాలు చేశారు, ఒక్కసారి హీరోయిన్ అయ్యాక ఆ తరహా రోల్స్ చేయాలని చూస్తారు. కానీ, వరలక్ష్మి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశా. ఆఫ్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ నచ్చింది. మనం కథలో చెప్పాలనుకున్న విషయం ఆరిస్టులు నమ్ముతున్నారా? లేదా? అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మితేనే ముఖంలో కనిపిస్తుంది, అది సినిమాకు హెల్ప్ అవుతుంది. దర్శకుడిగా ఆ స్వార్థంతో ఆవిడను సంప్రదించాను. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు. వరలక్ష్మి గారు డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేశారు కనుక కెమెరా, షాట్స్ గురించి అవగాహన ఉంటుంది. ఎక్కువ వివరించాల్సిన అవసరం ఉండదు.

గోపీసుందర్ మ్యూజిక్ గురించి!
‘ఎంత మంచివాడవురా’ చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడి, మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు, నా సినిమాకి ముందు సిట్యువేషన్స్ చెప్పాను. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కంప్లీట్ అయ్యాక రీ రికార్డింగ్ చేశారు. సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. సినిమాటోగ్రాఫర్ రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ తేజ్ ఎక్సట్రాడినరీ అవుట్ పుట్ ఇచ్చారు. మా టీం సహకారంతో మంచి సినిమా తీశాం.