ఇప్పటికీ సినీ ఫ్యాన్స్ లో ఏదైనా కొత్త సినిమా గురించిన చర్చ వస్తే- ‘ఇది ‘బాహుబలి’ రికార్డ్స్ కొడుతుందా?’ అన్న ప్రశ్ననే ముందుగా మెదలుతోంది. ‘బాహుబలి – ద బిగినింగ్’ వచ్చి ఏడేళ్ళవుతోంది. ఇక రెండో భాగం ‘బాహుబలి -ద కంక్లూజన్’ జనం ముందు నిలచి ఐదేళ్ళు కావస్తోంది. అయినా ఈ సినిమాల గురించే చర్చించుకుంటున్నారంటే ఆ చిత్రాలు మన సినీజనంపైనా, అభిమానులమీద చూపిన ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అంతటి చరిత్ర సృష్టించిన సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్.ఆర్.ఆర్.’ ఈ నెల 25న ప్రేక్షకులను పలకరించబోతోంది. పైగా ఇందులో మాస్ లో విశేషమైన ఫాలోయింగ్ ఉన్న జూనియర్ యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు. ఇక చర్చలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించవచ్చు. ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ‘బాహుబలి’ రికార్డులు బద్దలు కొడుతుందా లేదా అన్నదే అందరు సినీ ఫ్యాన్స్ లోనూ మెదలుతున్న ప్రశ్న! ఇదే ప్రశ్నను మంగళవారం ఏర్పాటు చేసిన ‘ట్రిపుల్ ఆర్’ ప్రెస్ మీట్ లో కొందరు మీడియా పర్సన్స్ రాజమౌళిపై సంధించారు. అందుకు ఆయన “మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. ఈ సినిమా ‘బాహుబలి’ని మించుతుందా? అని అడిగారు. అక్కడే ఆగిపోండి…” అని సమాధానమిచ్చారు. అంటే ఖచ్చితంగా ‘బాహుబలి’ని ‘ట్రిపుల్ ఆర్’ అధిగమిస్తుందనే విశ్వాసం రాజమౌళిలో కనిపించింది. ఆయనతో పాటు ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఇద్దరు హీరోలు తారక్, చరణ్ కూడా అంతే విశ్వాసంతో కనిపించారు.
ఉత్సాహమే కానీ…
మీడియావాళ్ళు అడిగిన పలు ప్రశ్నలకు రాజమౌళి, తారక్, చరణ్ హుషారుగా సమాధానాలిచ్చారు. వారి ఉత్సాహం చూస్తోంటే, ఎప్పుడెప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ మూవీని విడుదల చేసేద్దామా అన్న తీరున ఉన్నట్టు అనిపించింది. ఈ చిత్ర నిర్మాణం దాదాపు మూడేళ్ళు పట్టింది. అందులో ఒకటిన్నర సంవత్సరం కోవిడ్ తోనే గడచిపోయింది. మిగిలిన సంవత్సరం పాటు చిత్రీకరణ సాగితే, దానిని మెరుగులు దిద్దడానికి మరో అర్ధ సంవత్సరం సరిపోయింది. ఒక్క సినిమా కోసమే ఇంతకాలం పనిచేసినా, ఏ మాత్రం విసుగు చెందలేదని ఆ ముగ్గురు ఇచ్చిన సమాధానాలను బట్టి తెలుస్తోంది. కేవలం విశ్రాంతికి ముందు వచ్చే సీన్ కోసం దాదాపు అరవై రాత్రులు పనిచేసినట్టు తారక్ తెలిపారు. ఈ సినిమాలో నటించడమే ఓ మరపురాని అనుభూతి అని చరణ్ చెప్పారు. తారక్ నైజానికి తగ్గ పాత్ర కొమరమ్ భీమ్ అని, అలాగే చరణ్ మనస్తత్వానికి సరిపోయే పాత్ర అల్లూరి సీతారామరాజు అని రాజమౌళి వివరించారు. ఓ ప్రశ్నకు సమాధానంగా ఇద్దరు హీరోలు, “ఈ సినిమా కోసం మేము ప్రత్యేకించి వర్కవుట్స్ చేయలేదు. కానీ, మాతో రాజమౌళి గారే వర్కవుట్స్ చేశారు. ఆయన పనితీరులోనే మేం మగ్గిపోయామని” నవ్వుతూ చెప్పారు. మరో ప్రశ్నకు తారక్ సమాధానమిస్తూ, “మేం ప్రత్యక్షంగా అజయ్ దేవగణ్ తో పనిచేయలేదు. కానీ, అలియా భట్ తో కలసి నటించాం. ఆమెలోని పోటీపడి నటించే తత్వం బాగా నచ్చింది”అని చెప్పారు.
మరింత ఆనందం…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ కంటే ముందు నుంచీ మంచి స్నేహితులమైని తెలిపిన తారక్, చెర్రీ, ‘ఈ సినిమా తరువాత తమ మధ్య మరింత అనుబంధం పెరిగింద’ని తెలిపారు. ఈ సినిమా తరువాత తెలుగునాట ఎన్నో ‘మల్టీస్టారర్స్’ వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, మహేశ్ తో కలసి నటించాలని ఉందని తారక్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజమౌళి ఎప్పుడైనా ఐదు మంది హీరోలతో సినిమాలు తీస్తే, అందులో తామిద్దరమూ ఉంటామని, మిగిలిన ముగ్గురు ఎవరో రాజమౌళికే తెలియాలని తారక్ అన్నారు. ఈ ప్రెస్ మీట్ కు ముందు రోజున ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని దర్శకుడు రాజమౌళి, నిర్మాత డి.వి.వి. దానయ్య కలిశారు. తమ చిత్ర నిర్మాణ వ్యయాన్ని బట్టి టిక్కెట్ రేటు పెంచుకొనే వీలు కల్పించమని కోరేందుకు నిర్మాత, దర్శకుడు సీఎమ్ ను కలుసుకున్నారు. అందువల్ల ఆ కోణంలోనూ కొన్ని ప్రశ్నలు వచ్చాయి. అందుకు “ముఖ్యమంత్రిని కలిసిన తరువాత మాకు ఎంతో సంతృప్తి కలిగింది” అని రాజమౌళి చెప్పారు. ఈ ప్రెస్ మీట్ సాగుతున్న సమయంలోనే ‘ట్రిపుల్ ఆర్’ సినిమాకు ఏపీలో టిక్కెట్ పై అదనంగా రూ.100 పెంచుకొనే వెసలుబాటు కల్పిస్తూ ఉత్తర్వు వచ్చిందని ఓ మీడియా పర్సన్ తెలియజేశారు. దాంతో రాజమౌళి, తారక్, చరణ్ ముగ్గురి ముఖాల్లోనూ మరింత ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.
ఏపీలో రోజూ ఐదు ఆటలు ప్రదర్శించే వీలు కూడా కలిగిందని, అది కూడా తమ సినిమాకు కలసి వచ్చే అంశమని రాజమౌళి ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఇంతలా ‘ట్రిపుల్ ఆర్’కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ‘బాహుబలి’ని ఎన్ని రోజుల్లో ఏ తీరున అధిగమిస్తుంది అన్నదే ప్రస్తుతం అందరిలోనూ నెలకొన్న ఆసక్తి! అందుకు సమాధానం మార్చి 25న లభించనుంది.
