NTV Telugu Site icon

S. S. Rajamouli :ట్రిపుల్ ఆర్`కు `ఆస్కార‌`ం ఉంది!

Rrr

Rrr

రాజ‌మౌళి మేగ్న‌మ్ ఓప‌స్ `ట్రిపుల్ ఆర్` చిత్రానికి మ‌న దేశం నుండి ఆస్కార్ బ‌రిలోకి `ఉత్తమ అంత‌ర్జాతీయ చిత్రం` విభాగంలో ఎంట్రీ ల‌భించ‌కున్నా, ఆ సినిమా ఆస్కార్ బ‌రిలో ప‌లు విభాగాల్లో పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. ఎందుకంటే ఆస్కార్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఓ సినిమా (అది ఏ భాషా చిత్ర‌మైనా) లాస్ ఏంజెలిస్ లో సంవ‌త్స‌రంలో ఓ వారం పాటు ఇంగ్లిష్ స‌బ్ టైటిల్స్ తో ప్ర‌ద‌ర్శిత‌మై ఉండాలి. అలాంటి చిత్రం ఆస్కార్ బ‌రిలో త‌మకు త‌గిన విభాగాల్లో నామినేష‌న్స్ కోసం పోటీ ప‌డ‌వ‌చ్చు. `ట్రిపుల్ ఆర్` చిత్రం ఇంగ్లిష్ స‌బ్ టైటి్ల్స్ తోనే లాస్ ఏంజెలిస్ లో దాదాపు రెండు వారాల‌కు పైగా ప్ర‌ద‌ర్శిత‌మ‌యింది. కాబ‌ట్టి, ఆ చిత్రానికి ఆస్కార్ నామినేష‌న్ కు పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో `ట్రిపుల్ ఆర్` చిత్రాన్ని ఆస్కార్ బ‌రిలో నిల‌ప‌డానికి అక్క‌డి పంపిణీదారులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

`ట్రిపుల్ ఆర్` చిత్రం – ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు (రాజ‌మౌళి), ఉత్త‌మ ఒరిజిల్ స్క్రీన్ ప్లే (రాజ‌మౌళి, వి.విజ‌యేంద్ర‌ప్ర‌సాద్), ఉత్త‌మ న‌టుడు (య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్), ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు (అజ‌య్ దేవ‌గ‌న్), ఉత్త‌మ స‌హాయ‌న‌టి (అలియా భ‌ట్) విభాగాల్లో పోటీ ప‌డేందుకు సిద్ద‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా అమెరికా డిస్ట్రిబ్యూట‌ర్స్ ఈ విభాగాల్లో తాము `ట్రిపుల్ ఆర్` కోసం అప్లై చేయ‌నున్న‌ట్టు చెబుతున్నారు. ఇప్ప‌టి దాకా మ‌న దేశ చిత్రాల‌లో “మ‌ద‌ర్ ఇండియా, స‌లామ్ బాంబే, ల‌గాన్“ చిత్రాలు మాత్ర‌మే `ఉత్త‌మ విదేశీ చిత్రం` (ఇప్పుడు `ఉత్త‌మ అంత‌ర్జాతీయ చిత్రం`) విభాగంలో నామినేష‌న్స్ సంపాదించాయి. ఇక ఇత‌ర విభాగాల‌లోనూ మ‌న దేశానికి చెందిన‌వారు బ్రిటిష్ కొలాబ‌రేష‌న్స్ తో నిర్మించిన చిత్రాల ద్వారా “గాంధీ, స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్“ కు నామినేష‌న్స్ సంపాదించారు. ఒక‌వేళ `ట్రిపుల్ ఆర్`కు ఏ విభాగాల‌లోనైనా నామినేష‌న్స్ ల‌భిస్తే ఇత‌ర విభాగాల‌లో ఆ అర్హ‌త పొందిన తొలి భార‌తీయ‌ చిత్రంగా ఈ సినిమా నిలుస్తుంది.

Show comments