ప్రముఖ దివంగత నటి సౌందర్య 18వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలచుకుంటున్నారు. సౌందర్య తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అప్పుడే 17 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ… ఆమె ముగ్ద మనోహర రూపం, చెరగని చిరునవ్వు ఇంకా కళ్ళముందే కదలాడుతోంది అంటున్నారు అభిమానులు. ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తరువాత అంతటి అందం, అభినయం సౌందర్య సొంతం అనే ప్రశంసలను అందుకున్న సౌందర్యకు ఫ్యామిలి ఆడియన్స్ లోనే ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే గ్లామర్… కానీ గ్లామర్ అంటే స్కిన్ షో మాత్రమే కాదు నటన అని నిరూపించింది సౌందర్య. చక్కటి చీరకట్టులో మంచి కట్టూ, బొట్టు కలబోసిన నిండైన రూపంతో పదహారణాల తెలుగమ్మాయిలా, గృహిణిగా కన్పించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక నేడు సౌందర్య 18వ వర్ధంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
Read Also : Shaakuntalam : కీలక అప్డేట్ ఇచ్చిన సామ్
1972 జూలై 17న కర్ణాటకలోని కొలార్ లో సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించింది సౌందర్య. సౌందర్య తండ్రి సత్యనారాయణ రచయితగా, నిర్మాతగా కన్నడలో రాణించారు. సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చాక సౌందర్యగా మార్చుకుంది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో నటన వైపు మళ్లింది. అలా డాక్టర్ కావాల్సిన సౌందర్య యాక్టర్ గా మారి, అప్పట్లో స్టార్ హీరోయిన్ గా సౌత్ లో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో సౌందర్య నటించిన మొదటి చిత్రం “రైతు భారతం”. ఇందులో కృష్ణ హీరోగా నటించారు. కానీ ఆమె నటించిన ‘మనవరాలి పెళ్లి’ చిత్రమే ముందుగా రిలీజ్ అయ్యింది. ఇక అది మొదలుకొని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 100 సినిమాలకు పైగా నటించి, వెండితెర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేజీని లిఖించుకుంది. అయితే సౌందర్య సొంతగడ్డ కన్నడ అయినప్పటికీ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇక టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబులతో నటించింది. అప్పట్లో టాలీవుడ్ లో వెండితెరపై వెంకటేష్-సౌందర్య జంట హిట్ పెయిర్. ఈ జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా, జయం మనదేరా, పెళ్ళి చేసుకుందాం, పవిత్ర బంధం చిత్రాలు ఎవర్ గ్రీన్.
Read Also : Spy : నిఖిల్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ… టాస్క్ ఫిక్స్
సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే తన మేనమామ, తన బాల్య స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27లో వివాహం చేసుకుంది. సౌందర్య ‘అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ద్వారా సామాజిక సేవ కూడా చేసింది. ఇక రాజకీయాల్లో రాణించాలని అనుకుంటున్న సమయంలోనే సౌందర్యను ఘోర విమాన ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. 2004 ఏప్రిల్ 17న బెంగుళూరు నుండి బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేయడానికి కరీంనగర్ వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించింది. సౌందర్య మరణించినప్పుడు ఆమె వయస్సు కేవలం 31 సంవత్సరాలు. సౌందర్య ఇప్పుడు మన కళ్ళముందు లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. సౌత్ సినిమాల్లో ఆమె వేసిన ముద్ర చెరిగిపోనిది.