RAW NTR: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట భారీ సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ‘రా ఎన్టీఆర్’ సంస్థ ఇప్పుడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం వరకు వార్తల్లో నిలిచిన ఈ సంస్థ, తాజాగా తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో ‘విజయం సాధించిన వారందరికీ మా అభినందనలు’ అంటూ వ్యంగ్యం గా గుడ్‌బై చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ వివాదానికి ఆరంభం ‘ఊరు-వాడ’ పేరుతో ప్రకటించిన సేవా కార్యక్రమాలే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 100 కోట్లతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని సంస్థ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దానిపై పడింది. ఈ ప్రకటన తర్వాత తమిళ హీరో విజయ్ తన అభిమాన సంఘాల ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాల తరహాలోనే ఇది కూడా ఉందని, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి ఇదే తొలి అడుగు కావచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఆ ప్రచారానికి అంతే త్వరగా బ్రేక్ కూడా పడింది. ఈ మధ్యనే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా స్పందిస్తూ ‘రా ఎన్టీఆర్’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ పేరు, ఇమేజ్‌ను ఉపయోగించి కొందరు వ్యక్తిగత ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. దీంతో నందమూరి అభిమానుల్లో చాలామంది కూడా ఈ సంస్థపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ ప్రతినిధి సాయి రూప్ తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి తమ ఉద్దేశం పూర్తిగా సామాజిక సేవేనని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే 100 కోట్ల నిధులు ఎలా సమీకరిస్తారనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు మరింత తీవ్రం అయ్యాయి.
ఒకవైపు ఎన్టీఆర్ టీమ్ స్పష్టమైన ప్రకటన, మరోవైపు అభిమానుల నుంచి వస్తున్న వ్యతిరేకత సంస్థపై ఒత్తిడిని పెంచాయి. ఈ పరిణామాల మధ్య ‘రా ఎన్టీఆర్’ తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం విశేషంగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్టీఆర్ పేరుతో ప్రారంభమైన ఈ సంస్థ ఎందుకు ఇంత వేగంగా వెనక్కి తగ్గింది? ప్రారంభంలో ప్రకటించిన భారీ సేవా కార్యక్రమాల పరిస్థితి ఏమైంది? అనే అంశాలపై చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ‘రా ఎన్టీఆర్’ ముగింపు ప్రకటన సినీ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు అయితే దారితీసింది.
ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు 🙏🏻 pic.twitter.com/8fCvNuXvkD
— RAW NTR (@RAWNTR) July 22, 2026

