NTV Telugu Site icon

Ram Gopal Varma: మళ్ళీ వర్మకు పూర్వ వైభవం వచ్చేనా!?

Rgv

Rgv

Ram Gopal Varma: తన గురించి అందరూ మాట్లాడుకోవాలని ఆశించేవారు అధికంగా ఉంటారు. కానీ, అందుకోసం ఏం చేయాలో చాలామందికి తెలియదు. అయితే తెలివైన వారు ఏదో ఒక విధంగా తాము తరచూ వార్తల్లో ఉండేలా చూసుకుంటారు. ఆ కోవకు చెందిన వారే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిన వారెవ్వరూ కాదనలేరు. ఒకప్పుడు వైవిధ్యంతో అందరినీ ఆకట్టుకున్న రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ళుగా వివాదాలతోనే వార్తల్లో నిలుస్తూ సాగుతున్నారు. దాంతో మునుపటి వైభవం రామ్ గోపాల్ వర్మకు కరువైందనే చెప్పాలి. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ అనగానే ‘రియల్ క్రియేటర్’ అంటూ ఆసేతుహిమాచలపర్యంతం కీర్తించారు. వర్మ చేయి తాకితే చాలు అన్నట్టుగా ఆయన అభిమానులు సాగారు. దాదాపుగా ఓ స్టార్ హీరోకు ఉన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్న వర్మ 2005లో తెరకెక్కించిన ‘సర్కార్’ తరువాత మళ్ళీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నారు అన్నది నిర్వివాదాంశం!

తొలి చిత్రం ‘శివ’తోనే తనదైన బాణీ పలికిస్తూ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు వర్మ. ఆ చిత్రం హిందీ రీమేక్ తో ఉత్తరాదిన సైతం తనదైన శైలిని ప్రదర్శించారు రాము. ఇటు దక్షిణాన, అటు ఉత్తరాన జనం మెచ్చే చిత్రాలను రూపొందిస్తూ అరుదైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ గోపాల్ వర్మ. గ్యాంగ్ వార్స్ అన్నా, దెయ్యాలతో భయపెట్టడమన్నా వర్మకు మహా ఇష్టం. తరచూ ఈ రెండు జానర్స్ లోనే సినిమాలు తీస్తూ సాగారు వర్మ. అయినా తన ప్రతి చిత్రంలోనూ వర్మ టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. కథను అతను తెరకెక్కించే విధానానికి ఎంతోమంది ఫిదా అయిపోయి అభిమానులుగా మారారు. వర్మ స్ఫూర్తితోనే తెలుగునాట ఎంతోమంది దర్శకత్వంపై అభిమానం పెంచుకోవడం విశేషం!

వర్మ తెలుగులో తాను రూపొందించిన ‘గోవిందా గోవిందా’ చిత్రం విషయంలో అప్పటి ప్రాంతీయ సెన్సార్ ఆఫీసర్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. ఆ తరువాత తెలుగు చిత్రాలు తీయననీ భీష్మించారు. ఉత్తరాదిన వర్మ తీసిన చిత్రాలనే అనువాదం చేస్తూ తెలుగువారిని అలరించే ప్రయత్నం చేశారు. హిందీలో వర్మ రూపొందించిన ‘రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్’ వంటి చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. అక్కడ వరుస పరాజయాలు పలకరించగానే మళ్ళీ మాతృభాషవైపు దృష్టి సారించారు వర్మ. అయితే మునుపటి మ్యాజిక్ ప్రదర్శించలేకపోయారు. దాంతో వివాదాలను ఆధారం చేసుకొని, తన తాజా చిత్రాల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకొని కాంట్రవర్సీకి తెరతీసేవారు. ఆ వివాదాలే తన చిత్రాలకు పబ్లిసిటీగా వాడుకొని, లాభాలూ చూశారు. అయితే ప్రతీసారి అదే తీరున సాగుతున్న వర్మతీరు అభిమానులకు సైతం చిరాకు కలిగించింది. తన సంతృప్తి కోసమే తాను సినిమాలు తీసుకుంటానని, ఎవరికోసమో పంథా మార్చుకోననీ వర్మ కుండబద్ధలు కొట్టారు వర్మ. అయినా వర్మను అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. వారందరూ గతంలో వర్మ ప్రతిభను తలచుకుంటూ, ఎందుకతను అలా మారిపోయారో అర్థం కాక సతమతమవుతున్నారు.

ఒకప్పుడు వర్మ తన చిత్రాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించారు. అలా వర్మ తన రెండవ తెలుగు చిత్రం ‘క్షణక్షణం’తో కీరవాణికి సంగీత దర్శకునిగా ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాతోనే కీరవాణి బాణీలు జనాన్ని కట్టిపడేశాయి. ఆ తరువాత ఒక్కోమెట్టు ఎక్కుతూ కీరవాణి ఉత్తమ సంగీత దర్శకునిగా రాష్ట్ర, కేంద్రప్రభుత్వ అవార్డులనూ సొంతం చేసుకున్నారు. తాజాగా కీరవాణి అంతర్జాతీయ స్థాయిలోనూ తన ‘ట్రిపుల్ ఆర్’ మ్యూజిక్ తో గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో కీరవాణి, ముప్పై ఏళ్ళ క్రితమే తన ఫస్ట్ ఆస్కార్ ను రామ్ గోపాల్ వర్మ ‘క్షణ క్షణం’ ద్వారా అందుకున్నానని, ఆ సినిమాలేకపోతే తాను లేనని అన్నారు. తనపై అంతగా కృతజ్ఞత ప్రదర్శించిన కీరవాణికి వర్మ “ఆ మాటలు నన్ను చచ్చిపోయేలా చేశాయి. ఎందుకంటే చనిపోయినవారినే జనం పొగడుతూ ఉంటారు” అంటూ సమాధానమిచ్చారు. ఇలా ఉంటాయి, వర్మ అభినందనలు. అలా వైవిధ్యం పలికిస్తూనే సాగుతున్న వర్మ ఏదో ఒకరోజున మళ్ళీ మునుపటి వైభవం చూస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. మరి వారి అభిలాషను వర్మ ఎప్పుడు నెరవేరుస్తారో చూడాలి.