Ramcharan New Record: ఇప్పుడు భారతీయ సినిమా మార్కెట్‌లో స్టార్‌డమ్‌ను కొలిచే ప్రమాణాలు మారిపోయాయి. ఒకప్పుడు వంద రోజులు ఆడిన సినిమాలు, సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయానికి గుర్తులైతే, ఇప్పుడు తొలి రోజు వసూళ్లే స్టార్ పవర్‌ను నిర్ణయిస్తున్నాయి. ముఖ్యంగా రూ.100 కోట్ల ఓపెనింగ్ అనేది ఒక ప్రత్యేక మైలురాయిగా మారిపోయింది. ఆ క్లబ్‌లోకి చేరడం కూడా కష్టమే. అయితే ఒకసారి కాదు, రెండు సార్లు అదే ఘనత సాధించడం మరింత అరుదు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ అరుదైన జాబితాలో తన స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకున్నారు.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆరంభాన్ని నమోదు చేసింది. విడుదలైన తొలి రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. గ్రామీణ నేపథ్యం, క్రీడల అంశాలు, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సినిమా బలమైన కలెక్షన్లు నమోదు చేయడం విశేషం.
ఈ విజయంతో రామ్ చరణ్ కెరీర్‌లో మరో ముఖ్యమైన రికార్డు చేరింది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా విడుదలైన తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘పెద్ది’ కూడా అదే మార్క్‌ను అందుకోవడంతో, తొలి రోజు రూ.100 కోట్లకు పైగా వసూలు చేసిన రెండు సినిమాలు కలిగిన అరుదైన దక్షిణాది స్టార్‌ల జాబితాలో రామ్ చరణ్ చేరారు. ఒకే నటుడి రెండు చిత్రాలు ఈ స్థాయి ఓపెనింగ్స్ సాధించడం ఆయన మార్కెట్ వాల్యు ఏమిటో స్పష్టంగా తెలియజేస్తోంది.
భారతీయ సినీ పరిశ్రమలో ఈ ఘనత సాధించిన నటులు చాలా కొద్దిమంది మాత్రమే. అందులో మొదటి వరుసలో నిలిచే పేరు ప్రభాస్. ‘బాహుబలి 2’, ‘సాహో’, ‘ఆదిపురుష్’, ‘సాలార్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘ది రాజాసాబ్’ వంటి చిత్రాలు తొలి రోజే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆయన పాన్ ఇండియా క్రేజ్‌ను మరోసారి నిరూపించాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర పార్ట్ 1’ చిత్రాలతో ఈ క్లబ్‌లో స్థానం సంపాదించారు.
తమిళ సినీ పరిశ్రమ నుంచి తలపతి విజయ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన నటించిన ‘లియో’, ‘గోట్’ చిత్రాలు విడుదలైన మొదటి రోజే వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేశాయి. ఇదే తరహాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రాలతో తొలి రోజు వంద కోట్ల క్లబ్‌లో తన సత్తా చాటారు. విశేషమేమిటంటే ఈ రెండు చిత్రాలు ఒకే ఏడాదిలో విడుదలై భారీ విజయాలు సాధించాయి.
ఇప్పుడు ‘పెద్ది’ విజయంతో రామ్ చరణ్ కూడా ఈ ప్రత్యేక జాబితాలో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఒకప్పుడు ప్రాంతీయ మార్కెట్‌కే పరిమితమైన దక్షిణాది సినిమాలు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ మార్పులో రామ్ చరణ్ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వచ్చిన అంతర్జాతీయ గుర్తింపును కొనసాగిస్తూ, ‘పెద్ది’తో మరోసారి తన మార్కెట్ బలాన్ని నిరూపించిన రామ్ చరణ్, భవిష్యత్తులో మరిన్ని రికార్డులకు నాంది పలుకుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

