Queen 2: విడుదలకు ముందే చిక్కుల్లో కంగనా సినిమా.. రూ.250 కోట్ల కేసుతో కొత్త ట్విస్ట్!

Kangana Ranaut

Kangana Ranaut

Queen 2: ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు సహజంగానే పెరుగుతాయి. ముఖ్యంగా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్ కొట్టిన సినిమాకు సీక్వెల్ వస్తే ఆసక్తి మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి అంచనాల మధ్య తెరకెక్కిన కంగనా రనౌత్ మూవీ ‘క్వీన్ 2’ ఇప్పుడు విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాపై రూ.250 కోట్ల భారీ దావా నమోదవడం బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 2014లో విడుదలైన ‘క్వీన్’ కంగనా రనౌత్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మహిళా సాధికారత కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు వికాస్ బహ్ల్. ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా ఆకట్టుకున్న ఈ సినిమా కంగనాకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు అదే దర్శకుడు వికాస్ బహ్ల్ తెరకెక్కించిన ‘క్వీన్ 2’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఊహించని వివాదం తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం, ఫాంటమ్ స్టూడియోస్ సంస్థ జియోస్టార్పై బాంబే హైకోర్టులో రూ.250 కోట్ల దావా వేసింది. ‘క్వీన్ 2’ అనేది అనుమతి లేకుండా రూపొందించిన సీక్వెల్ అని, ‘క్వీన్’ చిత్రానికి సంబంధించిన ఐపీ హక్కుల్లో తమకు 50 శాతం వాటా ఉందని, భవిష్యత్తులో సీక్వెల్స్ నిర్మించే హక్కులు కూడా అందులో భాగమేనని ఫాంటమ్ స్టూడియోస్ పేర్కొంది. అయితే తమ అనుమతి లేకుండానే ఈ చిత్రాన్ని నిర్మించారని కోర్టులో వాదిస్తోంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించే ముందు సమస్యను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు కూడా సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫాంటమ్ స్టూడియోస్ బహిరంగ ప్రకటన విడుదల చేయడంతో పాటు, జియోస్టార్, దర్శకుడు వికాస్ బహ్ల్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆశించిన పరిష్కారం రాకపోవడంతో పాటు, సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిసిన తర్వాతే కోర్టును ఆశ్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇప్పటి వరకు ఈ వివాదంపై జియోస్టార్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అలాగే దర్శకుడు వికాస్ బహ్ల్ కూడా ఈ ఆరోపణలపై బహిరంగంగా స్పందించలేదు. దీంతో ఈ కేసు ఏ దిశగా మలుపు తిరుగుతుందనే ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.  ప్రస్తుతం ‘క్వీన్ 2’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ఈ న్యాయ వివాదం సినిమా విడుదలపై ప్రభావం చూపే అవకాశముందా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ కోర్టు విచారణ మరింత క్లిష్టంగా మారితే విడుదల తేదీ వాయిదా పడే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కంగనా అభిమానులు మాత్రం ఈ వివాదం త్వరగా ముగిసి సినిమా అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు.