NTV Telugu Site icon

Punyavanthi: మేటి నటీనటుల కలయికలో ‘పుణ్యవతి’!

Puntavathi

Puntavathi

Punyavanthi: నటరత్న యన్.టి.రామారావు తనను నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని ప్రతీతి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి యన్టీఆర్ ముందుండేవారు. అలా ఎందరికో ఆయన బాసటగానూ నిలిచారు. తన చిత్రం ‘దైవబలం’తో పరిచయమైన శోభన్ బాబు నటునిగా నిలదొక్కుకోవడానికి యన్టీఆర్ ఎంతగానో చేయూత నిచ్చారు. అందువల్లే దాదాపు పాతిక చిత్రాలలో యన్టీఆర్ తో కలసి శోభన్ బాబు నటించగలిగారు. ఆ తీరున యన్టీఆర్ పిలచి మరీ శోభన్ బాబుకు ఓ కీలకమైన పాత్రను ‘పుణ్యవతి’ చిత్రంలో కల్పించారు. నిజానికి ఈ చిత్రంలో యన్టీఆర్ కు ఒకే ఒక పాట ఉంటుంది. హిట్ సాంగ్స్ శోభన్ బాబు, హరనాథ్ పై చిత్రీకరించడం గమనార్హం! అలా తెరకెక్కిన ‘పుణ్యవతి’ 1967 నవంబర్ 3న విడుదలైంది.

‘పుణ్యవతి’ చిత్రానికి ఆధారం ప్రముఖ బెంగాల్ రచయిత డాక్టర్ నిహార్ రంజన్ గుప్త రాసిన కథ. దీని ఆధారంగానే హిందీలో ‘నయీ రోషిణి’ తెరకెక్కింది. ఆ చిత్రానికి తెలుగువారయిన సి.వి. శ్రీధర్ దర్శకత్వం వహించారు. ఆ సినిమాను నిర్మించిన వాసు మీనన్ అదే కథతో తెలుగులో ‘పుణ్యవతి’ని, తమిళంలో ‘పూవుమ్ పొట్టుమ్’ ను తెరకెక్కించారు. ఈ రెండు చిత్రాలకు వి.దాదామిరాసి దర్శకత్వం వహించడం విశేషం. ముందు హిందీ చిత్రం ‘నయీ రోషిణి’ విడుదల కాగా, ఆ సినిమా వచ్చిన కొన్ని నెలలకే తెలుగులో ‘పుణ్యవతి’ జనం ముందు నిలచింది. ఈ చిత్రం విడుదలైన రెండున్నర నెలలకు తమిళ చిత్రం ‘పూవుమ్ పొట్టుమ్’ వెలుగు చూసింది. మూడు భాషల్లోనూ ఈ కథ జనాన్ని ఆకట్టుకుంది. ‘పుణ్యవతి’ రిపీట్ రన్స్ లో భలే ఆదరణ చూరగొంది.

కథ విషయానికి వస్తే – ఓ కాలేజ్ లో లెక్చరర్ గా పనిచేసే ప్రకాశ్ డాక్టరేట్ చేయడానికి థీసిస్ తయారు చేస్తూ ఉంటాడు. ఆయనకు ఆ కాలేజ్ లోనే ప్రొఫెసర్ గా పనిచేసే కృష్ణారావు సాయం చేస్తానంటాడు. కృష్ణారావుకు ఎప్పుడూ కాలేజ్, లేదా పుస్తకాలే లోకం. కానీ, ఆయన భార్య పద్మావతి మోడరన్ భావాలున్నావిడ. కూతురు చిత్రను ఆధునీకరణ పేరుతో స్వేచ్ఛగా తిప్పుతూ ఉంటుంది. పద్మావతి ఎప్పుడూ పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటుంది. దాంతో ఆలనాపాలనా లేని ఇంట్లో ఆమె కొడుకు శేఖర్ తాగుబోతుగా మారి ఉంటాడు. అయితే అతనెప్పుడూ పేదవారి బాగు కోరుకుంటూ ఉంటాడు. అది పద్మావతికి నచ్చదు. కృష్ణారావు ఇంట్లోనే ఆయన స్నేహితుని కూతురు శాంతి కూడా ఉంటుంది. ఆమె కృష్ణారావు అడుగుజాడల్లో నడుస్తుంది. థీసిస్ నిమిత్తం తరచూ కృష్ణారావు ఇంటికి వస్తున్న ప్రకాశ్ కు శాంతి మధ్య ప్రేమ చిగురిస్తుంది. చిత్ర, రమేశ్ అనే వాడిని ప్రేమించి కాలు జారుతుంది. గర్భవతి అయిన ఆమెను రమేశ్ వదిలించుకోవాలని చూస్తాడు. చిత్ర ఆత్మహత్య చేసుకుంటుంది. రమేశ్ తండ్రి జడ్జి లక్ష్మణరావు. మంచి మనసున్న మనిషి. కొరప్రాణంతో ఉన్న చిత్ర మెడలో కొడుకు చేత తాళి కట్టించి, ఆమె సుమంగళిగా కన్నుమూసేలా చేస్తాడు. చిత్ర మరణంతో కృష్ణారావు, ఆయన భార్య పద్మావతి మంచం పడతారు. ప్రకాశ్ కు అంధురాలైన తల్లి ఉంటుంది. ఆమె పెంపకం వల్లే అతను లెక్చరర్ అయి ఉంటాడు. గుడ్డిదని తన తల్లిని వదలివేశాడని తండ్రి అంటే ప్రకాశ్ కు కోపం. కృష్ణారావుకు ప్రకాశ్ తన కొడుకే అన్న విషయం తెలుస్తుంది.చివరకు తాను ఎంతగానో గౌరవించే కృష్ణారావే తన తండ్రి అని తెలిసిన ప్రకాశ్ అసహ్యించుకుంటాడు. ఇంటిపట్టున ఉండకుండా తిరిగే శేఖర్ ను, శాంతి మాటలు మారుస్తాయి. దాంతో మారిన శేఖర్ ఇంటి భారం మోయడానికి పూనుకుంటాడు. తన మొదటి భార్యను కలుసుకొని క్షమాపణ చెప్పాలనుకుంటాడు కృష్ణారావు. అయితే ప్రకాశ్ తన తల్లిని కలుసుకోవడానిక వీల్లేదని అంటాడు. మరింత క్షోభకు గురవుతాడు కృష్ణారావు. తాను తన భార్యను మోసం చేయలేదని, ఆమె గుడ్డిది కాగానే ఇంట్లోవాళ్ళే వారి ఊరిలో వదిలేశారని చెబుతాడు కృష్ణారావు. ఆ విషయం తెలిసిన శేఖర్, ప్రకాశ్ తల్లి వద్దకు వచ్చి అంతా వివరిస్తాడు. నీవు క్షమించక పోతే, నాన్న మాకు దక్కడనీ చెబుతాడు. దాంతో ఆమె, భర్తను చూడటానికి వెళ్తుంది. భార్యాకొడుకులను చూసి కృష్ణారావు తనను క్షమించమంటాడు. కృష్ణారావు భార్యలిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆనందిస్తారు. ప్రకాశ్, శాంతికి పెళ్ళి చేయాలను కోవడంతో కథ ముగుస్తుంది.

యన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, భానుమతి, కృష్ణకుమారి, శోభన్ బాబు, హరనాథ్, అల్లు రామలింగయ్య, సీతారామ్, మల్లాది, కె.వి.చలం, జ్యోతిలక్ష్మి, పండరీబాయి, రాధాకుమారి నటించిన ఈ చిత్రానికి డి.వి.నరసరాజు రచన చేశారు. అన్ని పాటలూ సి.నారాయణ రెడ్డి పలికించారు. ఘంటసాల సంగీతం సమకూర్చారు. ఇందులోని “పెదవుల పైన సంగీతం… హృదయములోన పరితాపం…”, “ఇంతేలే నిరుపేద బ్రతుకులు…” పాటలను శోభన్ బాబుపై చిత్రీకరించారు. “ఎంత సొగసుగా ఉన్నావు…” పాటను హరనాథ్, జ్యోతిలక్ష్మిపై తెరకెక్కించారు. “మనసు పాడింది…” గీతం ఒక్కటే యన్టీఆర్, కృష్ణకుమారిపై రూపొందింది. “ఉన్నావా ఓ దేవా…”,”భలే బాగుంది…” అంటూ సాగే పాటలు సైతం అలరించాయి. నటునిగా శోభన్ కు ఈ సినిమా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో అమ్మాయిని నమ్మించి మోసంచేసిన పాత్రలో నటించిన హరనాథ్, ఆ తరువాతి సంవత్సరం కూడా ‘సుఖదుఃఖాలు’లో అలాంటి పాత్రనే పోషించారు. దాంతో హరనాథ్ కు ప్రేక్షకుల్లోనూ నెగటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఇందులో యస్వీఆర్ భార్యలుగా భానుమతి, పండరీబాయి నటించారు. అందరూ తమదైన అభినయంతో అలరించారు.