NTV Telugu Site icon

O Thandri Teerpu: హీరోగా మారిన పబ్లిసిటీ డిజైనర్!

O Thandri Teerpu

O Thandri Teerpu

ViVa Reddy: ప్రముఖ నటుడు మురళీ మోహన్ నటించిన ‘ఓ తండ్రి తీర్పు’ చిత్రాన్ని ఎవరూ అంత తేలికగా మర్చిపోరు. ఆ సినిమాలోని నటనకు గానూ ఆయన అప్పట్లో ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఆ చిత్రానికి మురళీమోహనే నిర్మాత కూడా. అయితే… మళ్ళీ ఇప్పుడు అదే పేరుతో మరో సినిమా రాబోతోంది. ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో ‘ఓ తండ్రి తీర్పు’ పేరుతో శ్రీరామ్ దత్తి ఓ సినిమాను నిర్మిస్తున్నారు. రాజేందర్ రాజు కాంచనపల్లి దీనికి రచనతో, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. దాదాపు ఐదు వందల చిత్రాలకు లోగోస్ తయారు చేసి, వంద చిత్రాలకు పబ్లిసిటీ డిజైనర్ గా వ్యవహరించిన వివ రెడ్డి (విష్ణువర్థన్ రెడ్డి మావూరపు) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత శ్రీరామ్ దత్తి మాట్లాడుతూ, “తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులపై ఉన్న ప్రేమ, వారిపై లేకపోవటం ఎంత మానసిక క్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా ‘ఓ తండ్రి తీర్పు’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న హీరో పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది. ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉంది” అని అన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యిందని, అలానే ఎడిటింగ్ వర్క్ సైతం కంప్లీట్ చేశామని సమర్పకుడు ఆరిగపూడి విజయ్ కుమార్ చెప్పారు. బాపు శాస్త్రి స్వరాలు సమకూర్చుతున్న ఈ సినిమాకు సురేశ్ చెటిపల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.