Prabhas : ‘ఫౌజీ’ బిజినెస్ వేట షురూ.. భారీ రేటుకు నార్త్ ఇండియా, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్!

Fauzi

Fauzi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రొమాంటిక్ అండ్ క్లాసిక్ సినిమాల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఫౌజీ. దేశభక్తి నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రభాస్ తన కెరీర్‌లో ఇప్పటివరకు టచ్ చేయని సరికొత్త జోనర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని మేజర్ థియేట్రికల్ డీల్స్ క్లోజ్ అయినట్లు సమాచారం.

‘బాహుబలి’ సినిమా నుండి ప్రభాస్ సినిమాలకు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘ఫౌజీ’ నార్త్ ఇండియా థియేట్రికల్ హక్కులను ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానికి చెందిన ‘AA Films’ సంస్థ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. బాహుబలి, సాహో, కల్కి లాంటి చిత్రాల నుంచి ప్రభాస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఏఏ ఫిల్మ్స్ ఈ డీల్‌ను లాక్ చేసింది. నార్త్ బెల్ట్‌లో ఈ సినిమాను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ‘ఫౌజీ’ సంచలన డీల్ సెట్ చేసుకుంది. ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ సొంతం చేసుకుంది. ప్రభాస్‌తో ‘సలార్’ లాంటి ఇండస్ట్రీ హిట్ నిర్మించిన హోంబాలే సంస్థ.. ఫౌజీ ఓవర్సీస్ హక్కులను చేజిక్కించుకోవడం విశేషం. ఇక ఓవర్సీస్‌లో మేజర్ మార్కెట్ అయిన నార్త్ అమెరికా రీజియన్‌లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది.షూటింగ్ దశలోనే ఈ రేంజ్ బిజినెస్ డీల్స్ క్లోజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ‘ఫౌజీ’ ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో అని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమవుతుండగా మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.