NTV Telugu Site icon

పి.సి.శ్రీ‌రామ్‌కు కెమెరాయే బా(ప్రా)ణం..!

భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాటోగ్రాఫ‌ర్స్ లో పి.సి.శ్రీ‌రామ్ స్థానం ప్రత్యేక‌మైన‌ది. రంగుల్లోనూ న‌లుపు, మెరుపులు మెరిపించి ఆక‌ట్టుకున్నారు శ్రీ‌రామ్. తెలుగువారిని ముందుగా త‌న అనువాద చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన పి.సి.శ్రీ‌రామ్ త‌రువాత త‌న‌దైన ఛాయాగ్రహ‌ణంతో ఇక్కడివారినీ విశేషంగా అల‌రించారు. యువ ద‌ర్శకులు ఎంద‌రో పి.సి.శ్రీ‌రామ్ ఛాయాగ్రహ‌ణంలో త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకున్నారు. ఈ నాటికీ శ్రీ‌రామ్ కెమెరా ప‌నిత‌నం కోసం ఎంతోమంది వేచి ఉంటారు అంటే అతిశ‌యోక్తి కాదు.

పి.సి.శ్రీ‌రామ్ 1956 జ‌న‌వ‌రి 26న మ‌ద్రాసులో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి, తాత‌, ముత్తాత‌లు అంద‌రూ విద్యాధికులు. పి.సి.శ్రీ‌రామ్ ముత్తాత‌ పి.ఆర్. సుంద‌ర‌మ్ అయ్యర్ పేరు మోసిన న్యాయ‌వాది. మ‌ద్రాసు హై కోర్టుకు ప్రధాన న్యాయ‌మూర్తిగా ప‌నిచేశారు. మ‌ద్రాసు లా జ‌ర్నల్ రూప‌శిల్పి. అలా చదువుల త‌ల్లి క‌టాక్షం పుష్కలంగా ఉన్న ఇంట్లో జ‌న్మించిన పి.సి.శ్రీ‌రామ్ కు చ‌దువుపై పెద్దగా ఆస‌క్తి ఉండేదికాదు. చిన్నత‌నం నుంచీ ఫోటోగ్రఫి అంటే ఆయ‌న‌కు ఎంతో ఇష్టం. ఓ నికాన్ కెమెరా తీసుకొని, దానితో సాధ‌న చేస్తూ అద్భుతంగా ఫోటోలు తీసేవారు. ఎలాగోలా డిగ్రీ అయింద‌నిపించుకున్న పి.సి.శ్రీ‌రామ్, త‌రువాత మ‌ద్రాసు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో చేరారు. అక్కడ మాత్రం త‌న‌కెంతో ఇష్టమైన స‌బ్జెక్ట్ కావ‌డం వ‌ల్ల భ‌లేగా రాణించారు. శ్రీ‌రామ్ కు క‌మ‌ల్ హాస‌న్, మ‌ణిర‌త్నం, సంతాన భార‌తి, సి.రుద్రయ్య, రాధార‌వి, ఆర్.సి.శ‌క్తి మంచి మిత్రులు. వారంతా శ్రీ‌రామ్ ను అభిమానంగా స‌మూ అని పిలుస్తూ ఉంటారు. సినిమాటోగ్రఫీలో ప‌ట్టా పొంద‌గానే , బ‌య‌ట‌కు వ‌చ్చి త‌మిళ చిత్రం వా ఇంద ప‌క్కం చిత్రానికి ప‌నిచేశారు శ్రీ‌రామ్. మ‌ణిర‌త్నం తొలి విజ‌యంగా నిల‌చిన మౌన‌రాగంకు శ్రీ‌రామ్ కెమెరా ప‌నిత‌నం ప్రాణం పోసింది. త‌రువాత మ‌ణిర‌త్నం ,క‌మ‌ల్ హాస‌న్ తో తెర‌కెక్కించిన నాయ‌క‌న్ చిత్రం ద్వారా శ్రీ‌రామ్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ ఛాయాగ్రాహ‌కునిగా అవార్డు ల‌భించింది. ఆ పై మ‌ణిర‌త్నం రూపొందించిన అగ్నిన‌చ్చత్రం, గీతాంజ‌లి, తిరుడా తిరుడా సినిమాల‌కు త‌న‌దైన ప‌నిత‌నంతో ఆక‌ట్టుకున్నారు. ముఖ్యంగా చీక‌టిలో మెరుపులు మెరిపిస్తూ అగ్నిన‌చ్చత్రంలో రాజా రాజాధి రాజా... పాట‌లో శ్రీ‌రామ్ చూపిన ప్రతిభ‌ను చూసి, బాలీవుడ్ సైతం అబ్బుర ప‌డింది. తెలుగులో పి.సి.శ్రీ‌రామ్ తొలి చిత్రం గీతాంజ‌లి. ఈ సినిమాలోనూ ఆయ‌న ప‌నిత‌నం జ‌నాన్ని ఇట్టే క‌ట్టిప‌డేసింది. ఈ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రాఫ‌ర్ గా శ్రీ‌రామ్ కు నంది అవార్డు ల‌భించింది. క‌మ‌ల్ హాస‌న్ విచిత్ర సోద‌రులు, దేవ‌ర్ మ‌గ‌న్, శుభ‌సంక‌ల్పం చిత్రాల‌లో పి.సి.శ్రీ‌రామ్ చేసిన ప్రయోగాలు ఇప్పటికీ కొత్తగా అనిపిస్తాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషికి, నితిన్ `ఇష్క్, రంగ్ దే“ చిత్రాల‌కు కూడా శ్రీ‌రామ్ సినిమాటోగ్రఫీ నిర్వహించి ఆక‌ట్టుకున్నారు.

పి.సి.శ్రీ‌రామ్ ద‌ర్శకునిగానూ అల‌రించారు. ఆయ‌న ద‌ర్శక‌త్వంలో రూపొందిన తొలి చిత్రం మీరా. ఆ త‌రువాత తెర‌కెక్కిన కురుత్తి పునాల్ తెలుగులో క‌మ‌ల్ హాస‌న్, అర్జున్ హీరోలుగా వ‌చ్చిన ద్రోహి. ఈ సినిమా ద‌ర్శకునిగా శ్రీ‌రామ్ కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ద్రోహికి మాతృక హిందీ ద్రోహ్ కాల్. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన ద‌ర్శకుడు గోవింద్ నిహ‌లానీ కూడా సినిమాటొగ్రాఫ‌రే కావ‌డం విశేషం. అందువ‌ల్ల ఆరంభంలో పి.సి.శ్రీ‌రామ్ ఏ తీరున ద్రోహిని ర‌క్తి క‌ట్టిస్తారో చూడాల‌ని సినీజ‌నం ఆస‌క్తిగా చూశారు. అయితే శ్రీ‌రామ్ సైతం త‌న‌దైన పంథాలో ద్రోహిని రూపుదిద్ది విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు. శ్రీ‌రామ్ ద‌ర్శక‌త్వంలో రూపొందిన మూడ‌వ చిత్రం వాన‌మ్ వాస‌ప్పదుమ్. ఇప్పటికీ త‌న ద‌రికి చేరిన చిత్రాల‌ను త‌న‌దైన పంథాలో తెర‌కెక్కించాల‌ని త‌పిస్తున్న పి.సి.శ్రీ‌రామ్ మ‌రిన్ని వ‌సంతాలు చూస్తూ ఆనందంగా సాగాల‌ని ఆశిద్దాం.