World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Pawan Kalyan (2)

Pawan Kalyan (2)

World Tribal Day 2026: ఈ రోజు (ఆగస్టు 9) ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రకృతిని, సంస్కృతిని కాపాడుతున్న గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తరతరాలుగా అడవులను కాపాడుతూ ప్రకృతి, సంస్కృతి, ప్రాచీన జ్ఞానాన్ని పరిరక్షిస్తున్న గిరిజనుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. గిరిజన సమాజాలతో తనకు ఉన్న అనుబంధం వ్యక్తిగతమైనదని, వారి గౌరవం, సంక్షేమం కోసం పనిచేయాలనే సంకల్పాన్ని వారి నమ్మకం మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. గిరిజన సంస్కృతిలో, సాంప్రదాయ వైద్యం, అటవీ సంపద రక్షణలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు.

గిరిజన ప్రాంతాల వికాసానికి, హక్కుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ‘అడవి తల్లి బాట’ వంటి కార్యక్రమాల ద్వారా మారుమూల గూడేలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారి అస్తిత్వానికి భంగం కలగకుండా ఆధునిక వికాసానికి బాటలు వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతలో ఆదివాసీల జీవన విధానం ఆదర్శమని, ప్రతి గిరిజన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివాసీల ఆశయాలు నెరవేరాలని, వారి జీవితాల్లో వెలుగులు నిండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈ రోజు సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని పంచుకున్నారు. అయితే దీనికి కొన్ని రోజుల ముందే (ఆగస్టు 1) విజయనగరం జిల్లాలోని భోగాపురం వద్ద జరిగిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఆ సభలో దాదాపు 13,000 మంది ఆదివాసీ మహిళలు హాజరైన వేళ, పవన్ కళ్యాణ్ గిరిజనుల సంస్కృతిని కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి సేవలను కొనియాడుతూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి అండగా ఉంటానని మరో సారి గుర్తు చేశారు.