M.L. Narasimham: ఇతర చిత్రసీమలతో పోల్చితే, తెలుగు సినిమా రంగానికి సంబంధించి వచ్చిన పుస్తకాలు తక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలోనే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, కాలమిస్టులు, సినీ ప్రేమికులు వివిధ అంశాలపై పుస్తకాలు తీసుకొస్తూ, తెలుగు సినిమా చరిత్రను నిక్షిప్తం చేసే పనిలో పడ్డారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సినీ గ్రంథానికి, ఫిల్మ్ జర్నలిస్ట్ కు నంది అవార్డులను ఇస్తుండేది. ఇవాళ్టి రోజున పుస్తక పఠనం తగ్గుతున్నా… సినిమా రంగానికి సంబంధించిన గ్రంథాలు రావడం కాస్తంత ఎక్కువైంది. అందులో భాగంగానే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఎం. ఎల్. నరసింహం ‘పాట వెనుక భాగోతం’ పేరుతో ఓ పుస్తకాన్ని వెలువరించారు. 1977 నుండి ఆయన ఫిల్మ్ జర్నలిస్ట్ గా కొనసాగుతున్నారు. ‘వనిత’, ‘విజయచిత్ర’ పత్రికల కోసం ఆయన రాసిన వ్యాసాలు ఆణిముత్యాలు. అలానే ‘ది హిందు’ దినపత్రికలో మూడు దశాబ్దాలకు పైగా ‘ఆన్ లొకేషన్’ ఫిల్మ్ ఫీచర్ ను ఎం. ఎల్. నరసింహం అప్రతిహతంగా నిర్వహిస్తున్నారు. నాటి మేటి 60 తెలుగు సినిమా పాటల తెర వెనుక ముచ్చట్లను ఆయన ఇటీవల పుస్తకంగా తీసుకొచ్చారు. ఈ ‘పాట వెనుక భాగోతం’ అనే పుస్తకాన్ని విజయా పబ్లికేషన్స్ అధినేత విశ్వనాథ రెడ్డి ప్రచురించారు. గీత సాగర మథనాన్ని తలపించే ఈ పుస్తకాన్ని కొని, చదివి, ఎవరికి వారు ఆస్వాదించాల్సిందే!
Vijaya Publications: ఎం.ఎల్. నరసింహం చెబుతున్న ‘పాట వెనుక భాగోతం’!
Show comments