Casting Couch: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఎన్నో ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. చాలామంది భయంతో బయటకు చెప్పకుండా మౌనం పాటిస్తుంటే, కొంతమంది మాత్రం సమయం వచ్చినప్పుడు తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా పంచుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నటి పరిణీత బోర్తకుర్ కూడా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పరిణీత బోర్తకుర్ సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. సినీ రంగంలో చేదు అనుభవాలు ఉన్నాయా అని ప్రశ్నించగా, అలాంటి అనుభవాన్ని తాను కూడా ఎదుర్కొన్నానని ఆమె స్పష్టం చేశారు. అయితే ఈ పరిశ్రమలో ఒక మంచి విషయం కూడా ఉందని, ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఎవరూ ఏమీ చేయలేరని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రవర్తన కూడా కీలకంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
తన కెరీర్ ప్రారంభ దశలో ఒక దక్షిణాది సినిమా కోసం తన ఫొటోలు షార్ట్‌లిస్ట్ అయ్యాయని సమాచారం వచ్చిందని పరిణీత చెప్పారు. ఆ తర్వాత ఆఫీస్‌కు వెళ్లగా అక్కడ మరికొందరు అభ్యర్థులు కూడా ఉన్నారని తెలిపారు. కొంతసేపటి తర్వాత తననే హీరోయిన్‌గా ఎంపిక చేశామని చెప్పి ఒప్పందంపై సంతకం చేయాలని కోరారని వివరించారు. ఆ సమయంలో అంతా సాధారణంగానే అనిపించిందని, సినిమా అవకాశం రావడంతో ఆనందపడ్డానని గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటన మాత్రం తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆమె చెప్పారు. మొదట తన శరీర కదలికలు తెలుసుకోవాలని దర్శకుడు చెప్పడంతో డ్యాన్స్‌కు సంబంధించిన విషయమే మాట్లాడుతున్నారని భావించానని తెలిపారు. కానీ వెంటనే మన ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఉండాలని కోరుకుంటున్నానని అతను చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానన్నారు. అప్పటికి తన వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమేనని, భయంతో గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైందని చెప్పారు. వెంటనే అక్కడి నుంచి లేచి నిలబడి తాను ఆ సినిమా చేయనని చెప్పి బయటకు వచ్చేశానని వెల్లడించారు.
ఆ సంఘటన తర్వాత వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పానని పరిణీత తెలిపారు. తన తండ్రి కూడా సినిమా అవసరం లేదని, వెంటనే ఇంటికి వచ్చేయమని చెప్పారని గుర్తు చేసుకున్నారు. అనంతరం ఆ దర్శకుడు ఫోన్ చేసి ఈ విషయం బయటకు చెప్పొద్దని, తాను కుటుంబానికి పెద్దవాడినని వేడుకున్నాడని వెల్లడించారు. సినిమాలో మంచి పాత్ర ఇస్తానని చెప్పినా, అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేసి ఆ అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించానన్నారు. పని కోసం ఎప్పుడూ అక్రమ మార్గాలను ఆశ్రయించలేదని, కెరీర్ కంటే ఆత్మగౌరవానికే ఎక్కువ విలువ ఇచ్చానని పరిణీత బోర్తకుర్ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే యువతకు ఇలాంటి అనుభవాలు ఎదురైతే ధైర్యంగా ‘నో’ చెప్పాలని ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా చెప్పకనే చెబుతున్నాయి. ఇక పరిణీత బోర్తకుర్ ‘బేపన్నా’, ‘సావధాన్ ఇండియా’, ‘గుప్తా బ్రదర్స్’, ‘ఏక్ థా రాజా ఏక్ థీ రాణి’ వంటి పలు టెలివిజన్ షోలతో ప్రేక్షకులకు చేరువయ్యారు.

