Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్‌లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు

Ashwatthama (2)

Ashwatthama (2)

Pakistan Independence Day: పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తీసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆగస్టు 14 సందర్భంగా కొందరు పాకిస్తానీ నటీమణులు తమ దేశ జెండాలను ఊపుతూ బాలీవుడ్ మూవీ ‘రాజీ’లోని దేశభక్తి గీతం ఏ వతన్ వతన్ మేరే దేశభక్తి పాటకు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో, అది పాకిస్తాన్‌లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా తీవ్ర చర్చకు కారణమైంది. పాకిస్తాన్ లో ప్రతి సంవత్సరం ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు వేడుకల్లో పాల్గొంటూ వీడియోలు పంచుకున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఐదుగురు మహిళలు చేతుల్లో పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఆనందంగా నృత్యం చేస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఆలియా భట్ నటించిన ‘రాజీ’ చిత్రంలోని ఏ వతన్ పాట వినిపించడం వివాదానికి కారణమైంది.

‘రాజీ’ భారత్‌కు చెందిన స్పై కథాంశంతో రూపొందిన సినిమా కావడం, అందులోని ఈ పాట భారత దేశభక్తిని ప్రతిబింబించడం వల్ల పలువురు నెటిజన్లు ఆ పాటను పాకిస్తాన్ స్వాతంత్ర్య వేడుకలకు ఉపయోగించడం సరి కాదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వీడియో విస్తృతంగా షేర్ అవుతుండటంతో ట్రోలింగ్ కూడా అలాగే పెరిగింది. ఈ అంశంపై పాకిస్తానీ ఇన్‌ఫ్లుయెన్సర్ ద్రాజ్ వారిస్ కూడా స్పందించారు. వైరల్ వీడియోను పంచుకుంటూ, ఇందులో పాల్గొన్న నటీమణులు ప్రముఖులు కావడంతో పాటను ఎంచుకునే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. రాజీ చిత్రంలోని పాట పాకిస్తాన్‌కు వ్యతిరేక నేపథ్యంతో ఉన్న సినిమాలో భాగమని, అలాంటి పాటతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడం అనవసర విమర్శలకు దారితీస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ సోషల్ మీడియా క్రియేటర్లు కూడా ఈ వీడియోపై ఎగతాళి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఈ వీడియో వివిధ సోషల్ మీడియా వేదికల్లో లక్షలాది వ్యూస్ సంపాదించగా, కొందరు దీనిని అమాయక తప్పిదంగా భావిస్తుండగా, మరికొందరు జాతీయ ఫెస్టివల్స్ సందర్భాల్లో ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్త అవసరమని అభిప్రాయపడుతున్నారు.