Bharat Bhhagya Viddhaata: 26/11 దాడుల గురించి మనం ఎన్నో కథలు విన్నాం. ఒకవైపు ముంబై నగరం ఉగ్రవాదుల కాల్పులతో వణికిపోతోతుంటే ప్రజల హాహాకారాల మధ్య నగరం అట్టుడికిపోయింది. సైనికులు, పోలీసులు కూడా ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలను పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలో బయటకు అంతగా వినిపించని మరో సాహసం కూడా ఉంది. వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది సిబ్బంది రోగులకోసం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వెనుక ఒళ్ళు జలదరించే విషయాలు ఉన్నాయి. కామా, అల్బ్లెస్ ఆసుపత్రి గోడల మధ్య జరిగిన ఈ అజ్ఞాత వీరుల పోరాటం గురించి వెలుగులో తెచ్చిన సినిమానే కంగనా నటించిన ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata).
2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రదాడులు ఇండియన్ హిస్టరీలోనే అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచిపోయాయి. ఉగ్రవాదులు నగరంలోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన సమయంలో భద్రతా దళాలు ప్రాణాలకు తెగించి పోరాడాయి. అయితే ఆ భయానక రాత్రిలో మరోచోట కూడా నిశ్శబ్దంగా ఒక యుద్ధం సాగింది. ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రిలో ఉన్న రోగులను కాపాడేందుకు అక్కడి సిబ్బంది ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కొన్నారు. ఆయుధాలు లేకపోయినా, తమ ముందు ఉన్న ప్రాణాలను కాపాడేందుకు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ‘భారత్ భాగ్య విధాత’ మూవీలో ఈ సాహసాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు.ఈ మూవీ 2026 జూన్ 12న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఇప్పుడు ఓటీటీలోకి కూడా అడుగు పెట్టబోతోంది. థియేటర్లలో చూడని వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఈ థ్రిల్లర్ మూవీని చూసేయచ్చు.
స్టోరీ
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన “భారత్ భాగ్య విధాత” సినిమా కథ 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడుల యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఈ మూవీ ముంబైలోని కామా హాస్పిటల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఉగ్రవాదులు హాస్పిటల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని రక్తపాతం సృష్టిస్తున్న ఆ చీకటి రాత్రి, నిజజీవితంలో ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను కోర్టులో ధైర్యంగా గుర్తించిన రియల్ లైఫ్ నర్స్ అంజలి కుల్తే పాత్ర స్ఫూర్తితో రూపొందించిన ‘గీతామాధవ్’ అనే నర్స్ పాత్రలో కంగనా రనౌత్ కనిపించారు. ఆ నరమేధం నడుమ గీతామాధవ్, అక్కడి వైద్య సిబ్బంది, వార్డ్ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దాదాపు 400 మంది రోగులను, ముఖ్యంగా 20 మంది గర్భిణీ స్త్రీలను ఉగ్రవాదుల బారి నుండి సురక్షితంగా కాపాడతారు. కష్టకాలంలో మామూలు మనుషులు సైతం ఎలా వీరులుగా మారి దేశ భక్తిని చాటారనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
Zee5లో స్ట్రీమింగ్
కంగనా రనౌత్, గిరిజా ఓక్, స్మిత తాంబే నటించిన ‘భారత్ భాగ్య విధాత’ హిందీ భాషలో థ్రిల్లర్ డ్రామాగా రూపొందింది. మనోజ్ తపాడియా దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 12న థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ మూవీ 2026 ఆగస్టు 14 హిందీ జీ5లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. 26/11లో జరిగిన విషాదాన్ని మరో కోణంలో చూపిస్తూ, ఆ భయానక రాత్రిలో ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన అజ్ఞాత వీరుల కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ మూవీని నిర్మించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది.

