Dhananjaya:’పుష్ప: ది రైజ్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కన్నడ హీరో ధనుంజయ. అందులో అతను పోషించిన జాలి రెడ్డి పాత్రకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతే… ఇప్పటి వరకూ అతను నటించిన కన్నడ చిత్రాలు వరుసగా తెలుగులో డబ్ కావడం మొదలైంది. అలా… గత యేడాది చివరిలో విడుదలైన ‘బడవ రాస్కేల్’ మూవీని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇక తాజాగా, ధనుంజయ నటించిన కన్నడ సినిమాలను డబ్ చేసి, ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈ యేడాది వచ్చిన ‘కేజీఎఫ్-2’, ‘కాంతార’ సినిమాలు ఇక్కడా ఘన విజయం సాధించడంతో పలు కన్నడ చిత్రాలు డబ్ కావడం ఎక్కువైంది. డిసెంబర్ 9న కన్నడ చిత్రం ‘విజయానంద్’ తెలుగులోనూ రిలీజ్ అవుతుండగా, డిసెంబర్ 30న ధనుంజయ చిత్రం ‘వన్స్ అపానే టైమ్ ఇన్ జమిలిగుడ్డ’ సినిమా తెలుగులో ‘వన్స్ అపానే టైమ్ ఇన్ దేవరకొండ’ పేరుతో డబ్ అయ్యి రిలీజ్ కానుంది. ఈ సినిమా కథ గురించి దర్శకుడు కౌశల్ గౌడ చెబుతూ, ‘ఈ సమాజం ఓ మంచి మనిషి… చెడ్డవాడిగా మారిపోతే అంగీకరిస్తుంది. కానీ అదే చెడ్డమనిషి… మంచి వాడిగా మారితే మాత్రం ఆమోదించదు. అసలు మంచి ఏమిటీ? చెడు ఏమిటీ? అనే అంశం మీద ఈ కథ సాగుతుంది” అని అన్నారు. అదితి ప్రభుదేవా, ప్రకాశ్ బేలవాడి, యశ్ శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కన్నడ, తెలుగు టీజర్స్ 29వ తేదీ విడుదల కాబోతున్నాయి.