ఒకప్పుడు సినిమా తీయాలంటే ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ లేదా కోట్లాది రూపాయల బడ్జెట్ ఉండాలనే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు కేవలం ప్రతిభ, విభిన్నమైన కథ ఉంటే చాలని నిరూపిస్తున్నారు నేటితరం దర్శకులు. హాలీవుడ్ కు చెందిన కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ తాను రాసుకున్న ఓ కథతో ఫిల్మ్‌మేకర్‌గా మారి మ్యాజిక్ చేశారు. క్యారీ దర్శకత్వంలో వచ్చిన డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ ‘అబ్సెషన్’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం 12 రోజుల్లోనే ఈ సినిమా వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర లిఖించింది.
ఈ హారర్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను కేవలం $0.75 మిలియన్ల (సుమారు రూ. 6.25 కోట్లు) అతి తక్కువ బడ్జెట్‌తో కేవలం 20 రోజుల్లోనే నిర్మించారు. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విద్వంసం సృష్టిస్తూ కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $100 మిలియన్ల (సుమారు రూ. 830 కోట్లు) గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం నోరెళ్లబెట్టేలా చేసింది. పెట్టిన పెట్టుబడికి వంద రెట్లకు పైగా లాభాలను తెచ్చిపెడుతూ 2026లోనే అత్యంత భారీ లాభాలు తెచ్చిన హాలీవుడ్ సినిమాగా ఇది నిలిచింది.
తన చిన్ననాటి స్నేహితురాలు, క్రష్ అయిన అమ్మాయిని ఎలాగైనా ప్రేమలో పడేయాలని ఒక యువకుడు ఒక అతీత శక్తులున్న బొమ్మ సహాయంతో కోరిక కోరతాడు. ఆ కోరిక తీరి ఆ అమ్మాయి అతడితో వచ్చేస్తుంది. అయితే ఆ తర్వాత ఆమె చూపించే అమితమైన ప్రేమ, పిచ్చి ఎంత భయంకరంగా, హింసాత్మకంగా మారుతుందనే కాన్సెప్ట్‌తో ఈ హారర్ చిత్రాన్ని తెరకెక్కించారు. సరికొత్త హారర్ ఎలిమెంట్స్, అదిరిపోయే బాడీ లాంగ్వేజ్‌తో థియేటర్లలో ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తోందీ చిత్రం. అమెరికా, యూరప్ దేశాల్లో ఇప్పటికే హారర్ లవర్స్‌ను పిచ్చెక్కించిన ఈ సెన్సేషనల్ మూవీ.. ఇప్పుడు ఇండియాలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఇండియన్ సెన్సార్ బోర్డు (CBFC) నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, మన దేశంలోని మల్టీప్లెక్స్‌లలో స్పెషల్ నైట్ షోలతో విడుదల కాబోతోంది. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన కర్రీ బార్కర్ హాలీవుడ్‌లో సృష్టించిన ఈ రేంజ్ హారర్ వండర్‌ను ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే!
