వినూత్నమైన కంటెంట్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ అందరి హృదయాల్లో తనదైన స్ధానాన్ని దక్కించుకున్న మోస్ట్ పాపులర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మరో ఒరిజినల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్షన్ మై లార్డ్’. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రుషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రధారులుగా నటించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్. ఈ సిరీస్ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ సిరీస్‌ను రూపొందించారు. 7 ఎపిసోడ్స్‌తో ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ ఒరిజినల్ జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కోర్ట్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్‌ను గమనిస్తే..ఓ లేడీ వాయిస్‌తో ట్రైలర్ మొదలవుతుంది..యంగ్ లేడీ లాయర్ అనన్య శ్రీకాంత్ క్యారెక్టర్ గురించి ఆరా తీయడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “ప్రాణం పోయినా ఆయన్ను ఏ బ్లాక్‌లో చూడలేం”, “నా 20 ఏళ్ల సర్వీస్‌లో ఆ నోటరీని ఈ కోర్టులో ఎప్పుడూ చూడలేదు” అని తోటి లాయర్లు చెప్పే డైలాగ్స్ హీరో పాత్రపై ఆసక్తిని కలిగిస్తాయి. కోర్ట్ ప్రాంగణంలో నారాయణ అనే వ్యక్తి తన కనిపించకుండా పోయిన కూతురు సమీర కోసం ఆత్మాహుతి చేసుకోవడం కథను మలుపు తిప్పుతుంది. అది సూసైడ్ కాదని, మర్డర్ అనే అనుమానాలు వ్యక్తమవుతాయి. ఏళ్ల తరబడి కేసులు వాదించని ‘ఫెయిల్యూర్ లాయర్’గా ముద్రపడిన పరశురామ్, సడన్‌గా పాపులారిటీ, డబ్బు కోసం ఈ డెస్పరేట్ అటెంప్ట్ చేస్తున్నాడని ప్రతినాయకుడి పాత్రలో ఉన్న ముకేష్ రుషి కామెంట్ చేయడం సీరియస్‌నెస్‌ను పెంచుతుంది. ఎన్నో ఏళ్లుగా కోర్టుకు దూరంగా ఉన్న పరశురామ్ ఏ బ్లాక్‌కి ఎందుకు వెళ్లడు? నారాయణ ఆత్మాహుతి కేసుని ఆయన ఎందుకు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది? అసలు కిడ్నాప్‌కి గురైన సమీర ఎవరు? పరశురామ్ ఈ కేసులో గెలిచాడా లేదా? అనేది సిరీస్‌లోనే చూడాలి.

