Oscar 2023: రాజమౌళి రూపొందించిన భారీ చిత్రం `ట్రిపుల్ ఆర్` కానీ, `కశ్మీరీ ఫైల్స్` కానీ ఈ సారి మన దేశం నుండి ఆస్కార్ అవార్డులకు అఫిషీయల్ ఎంట్రీగా ఎన్నికవుతాయని పలువురు జోస్యం చెప్పారు. కానీ, గుజరాతీ చిత్రం `చెల్లో షో`ను ఆస్కార్ అవార్డులకు భారతదేశం నుండి అఫిసియల్ ఎంట్రీగా ఎంపిక చేశారు. చెన్నైలో జరిగిన ఈ ఎంపికలో `చెల్లో షో` పేరును మంగళవారం అధికారికంగా ప్రకటించారు. `ట్రిపుల్ ఆర్`లో దేశభక్తి, తెల్లవారిని ఎదిరించి పోరాడిన ఇద్దరు సాహస యువకుల గాథ ఉంది. అందువల్ల చాలామంది `ట్రిపుల్ ఆర్`కు మన దేశం నుండి అధికారికంగా ఆస్కార్ ఎంట్రీ లభిస్తుందని ఊహించారు. ఇక కాశ్మీర్ లో జరిగిన మారణకాండకు నిదర్శనాలు చూపుతూ తెరకెక్కిన `కశ్మీరీ పైల్స్` సాధించిన అనూహ్య విజయాన్నీ దృష్టిలో ఉంచుకొని, పైగా ఆ సినిమాను ప్రభుత్వమే కొన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించిన కోణాన్ని దృష్టిలో పెట్టుకొనీ ఆ సినిమాకు ఆస్కార్ ఎంట్రీ దక్కుతుందని భావించారు. అయితే ఈ రెండు సినిమాలు కాదని గుజరాతీ చిత్రం `చెల్లో షో`కు ఆస్కార్ ఎంట్రీ అధికారికంగా లభించడం విశేషం!
`చెల్లో షో` అంటే `చివరి ఆట` అని అర్థం. ఈ సినిమాను పాన్ నళిన్ గా పేరొందిన నళిన్ కుమార్ పాండ్య నిర్మించి, దర్శకత్వం వహించారు. ధీర్ మొమయా, మార్క్ డ్యుయలే ఆయనకు నిర్మాణ భాగస్వాములు. గతంలోనూ నళిన్ కుమార్ పాండ్య తెరకెక్కించిన “సంసార, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, యాంగ్రీ ఆఫ్ ఇండియన్ గాడెసెస్“ వంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికలపై జేజేలు అందుకున్నాయి. ఆయన తెరకెక్కించిన `చెల్లో షో`లోనూ కథ, కథనం అందరినీ ఆకట్టుకొనేలా రూపొందింది. ఈ చిత్రంలో సమయ్ అనే తొమ్మిదేళ్ళ కుర్రాడు, ఫాజల్ అనే సినిమా ప్రొజెక్షన్ ఆపరేటర్ తో స్నేహం చేస్తాడు. అతని వల్ల ప్రొజెక్షన్ రూమ్ లో కూర్చుని వేసవిలో అనేక చిత్రాలు చూసి, సినిమాలపై ఆసక్తి పెంచుకుంటాడు. తరువాత సినిమానే జీవితంగా భావిస్తాడు. ఈ కథలో కొన్ని అంశాలు ప్రఖ్యాత ఇటాలియన్ మూవీ `సినిమా ప్యారడిసో`ను తలపిస్తాయి. అయినా ఈ సినిమా కూడా అంతర్జాతీయ వేదికలపై ఇప్పటికే అభినందనలు అందుకుంది. ట్రిబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన తొలి గుజరాతీ చిత్రంగా `చెల్లో షో` నిలచింది. అలాగే 11వ బీజింగ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ప్రదర్శితమయింది. అన్నిటినీ మించి 66వ వల్లడోలిడ్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ స్పైక్ అవార్డునూ అందుకుంది. ఇంత నేపథ్యం ఉన్నందువల్లే `చెల్లో షో` సినిమాను ఆస్కార్ కు మన దేశం నుండి అధికారిక ఎంట్రీగా ఎంపిక చేశారని చెప్పవచ్చు.
ఇక పోతే, కొందరు విమర్శకులు మాత్రం కేంద్రంలో అధికారం చెలాయిస్తున్నది గుజరాత్ వారే కాబట్టి, ఆ కోణంలోనే `చెల్లో షో`ను ఎంపిక చేసి ఉంటారనీ అంటున్నారు. అయితే `చెల్లో షో`లో విషయం లేకపోతే కమిటీ దానిని బెస్ట్ గా ఎన్నిక చేయదనీ కొందరి మాట. ఏది ఏమైనా ఇప్పుడు అందరి దృష్టినీ గుజరాతీ చిత్రం `చెల్లో షో` ఆకర్షిస్తోంది. ఈ సినిమా 2021 జూన్ 10 ట్రైబెకా ఫిలిమ్ ఫెస్టివల్ లో తొలిసారి ప్రదర్శితమయింది. మరి ఆస్కార్ ఎంట్రీగా మన దేశం ప్రకటించింది. ఈ సినిమాకు `బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిలిమ్` కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ కూడా లభిస్తే, ఆ తరువాత పోటీలో తన చిత్రాన్ని విజేతగా నిలిపేందుకు పాన్ నళిన్ ఎలాంటి కృషి చేస్తారో చూడాలి.
