బెట్టింగ్ యాప్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ముగ్గురు నటీమణులను ఈరోజు విచారిస్తోంది. టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. జీత్ విన్ అనే బెట్టింగ్ సైట్‌ను నిధి ప్రమోట్ చేశారు. సీఐడీ అధికారులు నిధిని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు పలువురు సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రంమలోనే నిధి అగర్వాల్ విచారణకు హాజరయ్యారు.
ప్రముఖ యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అమృత చౌదరి కూడా విచారణకు హాజరయ్యారు. జంగిల్ రమ్మీ యాప్‌ను శ్రీముఖి ప్రమోట్ చేయగా.. పలు బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లను అమృత చౌదరి ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సమయంలో వారు తెలుసుకున్న సమాచారం ఏంటి?, ఒప్పందాలు ఎలా కుదిరాయి?, ఆర్థిక లావాదేవీలు జరిగాయా? వంటి కీలక అంశాలపై విచారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, విష్ణు ప్రియ, సిరి హనుమంతులు విచారణకు హాజరయ్యారు.
