Narne Nithiin: వరుస హిట్ల తర్వాత కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో నార్నే నితిన్

Narne Nithiin (2)

Narne Nithiin (2)

Narne Nithiin: యువ హీరో నార్నే నితిన్ కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. వరుసగా మూడు విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ఆయన, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నార్నే నితిన్, మరోసారి యూత్‌ను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో అలరించబోతున్నారు. #NN5 వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను దర్శకుడు రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌కే మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కావడంతో చిత్రబృందం పూర్తి స్థాయిలో షూటింగ్‌కు సిద్ధమవుతోంది. యువతను ఆకట్టుకునే ప్రేమకథతో పాటు వినోదానికి పెద్దపీట వేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో నార్నే నితిన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ‘బుట్ట బొమ్మ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అనిఖా సురేంద్రన్ మరోసారి టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరోవైపు కన్నడ చిత్రసీమలో మంచి గుర్తింపు పొందిన మేఘా శెట్టి ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయని సమాచారం. సినీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత వెంకట్ కె. నారాయణ తొలి క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ తొలి షాట్‌కు దర్శకత్వం వహించగా, నిర్మాత స్క్రిప్ట్‌ను దర్శకుడు రాధా కృష్ణ రెడ్డికి అందించి షూటింగ్ ను ఆఫీషియల్ గా ప్రారంభించారు.

నార్నే నితిన్ వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై కూడా ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల యువ హీరోల చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, #NN5 కూడా అదే జోరును కొనసాగిస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. నార్నే నితిన్‌కు ఇది మరో కీలక చిత్రం కానుండగా, అనిఖా సురేంద్రన్‌కు టాలీవుడ్‌లో బలమైన కమ్‌బ్యాక్, మేఘా శెట్టికి తెలుగు ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం వెల్లడించనుంది.