Site icon NTV Telugu

Ey Pilla: రవితేజ బ్రదర్ రఘు తనయుడితో నల్లమలుపు బుజ్జి సినిమా!

Ey Pilla

Ey Pilla

ఆగస్ట్ 9వ తేదీ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నిర్మిస్తున్న సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ ను తెలిపారు. మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడిని నల్లమలుపు బుజ్జి హీరోగా పరిచయం చేయబోతున్నారు. రవితేజ తమ్ముడు రఘు కొన్ని చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించాడు. అతని కుమారుడు మాధవ్ భూపతిరాజుతో నల్లమలుపు బుజ్జి ‘ఏయ్ పిల్లా’ అనే మూవీని నిర్మించబోతున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహాప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఇది రూపుదిద్దుకోనుంది. నల్లమలుపు బుజ్జి బర్త్ డే సందర్బంగా మూవీ టైటిల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ ”హృదయానికి హత్తుకునే ఓఅందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతిని ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 1990 నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.

‘ఏయ్… పిల్లా’ చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నర్ రూబెన్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె. నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రానికి అన్వర్ సంభాషణలు రాస్తున్నారు. ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా గణేష్ ముప్పానేని వ్యవహరిస్తున్నారు.

Exit mobile version